Wed Nov 27 2024 05:53:19 GMT+0000 (Coordinated Universal Time)
వీర జవాన్ చెల్లెలి పెళ్లికి కదిలొచ్చిన సైన్యం
వీర జవాన్ చెల్లెలి పెళ్లికి ఆర్మీ సైన్యం కదిలొచ్చింది. తన సోదరుడు లేని లోటును తీర్చేందుకు సైనికులే సోదరులయ్యారు.
వీర జవాన్ చెల్లెలి పెళ్లికి ఆర్మీ సైన్యం కదిలొచ్చింది. తన సోదరుడు లేని లోటును తీర్చేందుకు సైనికులే సోదరులయ్యారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ 2020 అక్టోబర్లో కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించాడు. అతనికి గౌరవ సూచికంగా.. అతని స్థానంలో నిలబడి సోదరి జ్యోతి పెళ్లి చేసేందుకు డిసెంబర్ 13, 2021వ తేదీన అనేకమంది జవాన్లు రాయ్ బరేలీకి వెళ్లారు. శైలేంద్ర ఉంటే చెల్లెలి పెళ్లికి ఏమేమి పనులు చేసేవాడో.. ఆ పనులన్నింటినీ జవాన్లు ఆర్మీ యూనిఫారమ్ లోనే చేశారు. మండపానికి పెళ్లికూతురిని తీసుకువెళ్లేటపుడు కూడా వారే స్వయంగా పైన క్లాత్ ను పట్టుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంప్రదాయ బద్ధంగా....
పెళ్లికూతురైన జ్యోతికి బహుమతులు అందించిన సైనిక సోదరులు.. సంప్రదాయబద్ధంగా దగ్గరుండి పెళ్లి జరిపించారు. పెళ్లి వేడుకలో ఏ లోటు రాకుండా చూసుకున్నారు. పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులందరూ సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన పనులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. సోదరుల పాత్రను పోషించిన జవాన్లు అమరవీరుడు శైలేంద్ర లేని లోటును భర్తీ చేయడానికి తమవంతు ప్రయత్నం చేశారని సీనియర్ అధికారి వారిని అభినందించారు. వీర జవాన్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ తల్లిదండ్రులు కూడా సైనిక సోదరులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. జవాన్లందరూ తమ కూతురు జ్యోతి పెళ్లికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. "నా కొడుకు ఈ లోకంలో లేకపోయినా.. సీఆర్పీఎఫ్ జవాన్ల రూపంలో ఎంతోమంది కొడుకులు ఉన్నారు. వారు ఎప్పుడూ మాకు అండగా ఉంటారు." అని శైలేంద్ర తండ్రి భావోద్వేగంతో చెప్పారు.
Next Story