Sat Nov 23 2024 04:54:29 GMT+0000 (Coordinated Universal Time)
తీవ్రతుపానుగా అసని.. రెండు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
విశాఖకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర
విశాఖపట్నం : ఆగ్నేయ బంగాఖాతంలో రెండ్రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా రూపాంతరం చెంది.. ఆపై తుపానుగా మారింది. ఈ తుపానుకు అసనిగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న అసని తుపాను.. ఆదివారం సాయంత్రం తీవ్ర తుపానుగా మారినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఇది అండమాన్ నికోబార్ దీవులకు 610 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర- ఒడిశా రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మే 10వ తేదీ నాటికి అసని తుపాను ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు చేరువగా వస్తుంది.. కానీ అక్కడ తీరందాటే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వివరించింది. అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. తుపాను ప్రభావంతో.. ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో పలుచోట్ల మంగళవారం సాయంత్రం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గజపతి, గంజాం, పూరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు (7 -11 సెం.మీ.) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.
మే 10వ తేదీ సాయంత్రం నుండి ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా మే 11, బుధవారం కోస్తా, ఒడిశా, ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్లోని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. "వచ్చే 5 రోజులలో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 10 నుంచి 12వ తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్ లో, 9న అస్సాం-మేఘాలయ & మిజోరం-త్రిపుర మీదుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది." అని ఐఎండీ వెల్లడించింది. 12వ తేదీ నాటికి తుపాను.. వాయుగుండంగా బలహీనపడుతుందని, అప్పటివరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
Next Story