Mon Dec 23 2024 08:01:43 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నపిల్లలపై పంజా విసురుతోన్న కరోనా కొత్తవేరియంట్.. కొత్త లక్షణాలివే
కళ్లలో పుసులు ఎక్కువగా రావడం, దురద వంటి లక్షణాలను గతంలో వచ్చిన వేరియంట్లలో చూడలేదని, ఇవి కొత్తవేరియంట్ల లక్షణాలేనని..
దేశంలో కరోనా కేసులు మళ్లీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. మూడు-నాలుగు రోజులుగా రోజువారీ కేసులు 5 వేలను దాటి నమోదవుతుండగా.. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన బులెటిన్ లోనూ 6,155 కోవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. వీటితో కలిసి ప్రస్తుతం దేశంలో 31,194 యాక్టివ్ కేసులున్నాయి. అయితే పెరుగుతున్న కోవిడ్ కేసులకు ‘ఎక్స్బీబీ 1.16’ లేదంటే, ‘ఆర్ట్కురుస్’గా పిలిచే కొత్త వేరియంటే కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ వేరియంట్ అధికంగా చిన్నారులపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు.
అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో పాటు.. కళ్లకు పుసులు, దురద వంటి లక్షణాలు తాజాగా నమోదవుతున్న కేసుల్లో కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్లలో పుసులు ఎక్కువగా రావడం, దురద వంటి లక్షణాలను గతంలో వచ్చిన వేరియంట్లలో చూడలేదని, ఇవి కొత్తవేరియంట్ల లక్షణాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్స్బీబీ 1.16 వేరియంట్ కు సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్ -2 జీనోమిక్స్ కన్సార్షియం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇవి రెండు కేసులు మాత్రమే ఉన్నట్టు పేర్కొంది. గత వేరియంట్లతో పోలిస్తే ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతకమైన వేరియంట్ కాకపోయినప్పటికీ.. రూపాంతరం చెంది బలపడవచ్చని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియా వాన్ ఖెర్ఖోవ్ తెలిపారు.
Next Story