Mon Dec 23 2024 18:56:39 GMT+0000 (Coordinated Universal Time)
బసవతారకం ఆసుపత్రికి జాతీయ అవార్డు
భారతదేశంలోనే రెండవ అత్యుత్తమ అంకాలజీ ఆసుపత్రిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అవుట్ లుక్ ఇండియా మ్యాగజైన్ అవార్డుకు..
బసవతారకం ఆస్పత్రి జాతీయ అవార్డుకి ఎంపికైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్.. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లను మామూలు మనుషులుగా చేసింది. నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ నడిపిస్తున్న ఆ ఆస్పత్రి ద్వారా చాలా మందికి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నయమైంది. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా వేలాది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడంలో ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన కొనియాడి, అభినందనలు తెలిపారు.
భారతదేశంలోనే రెండవ అత్యుత్తమ అంకాలజీ ఆసుపత్రిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అవుట్ లుక్ ఇండియా మ్యాగజైన్ అవార్డుకు ఎంపికైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, యాజమాన్యం, వైద్యబృందం, ఇతర సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయిలో క్యాన్సర్ చికిత్సను పూర్తిగా అందించేందుకు ఆసుపత్రి చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు. వృత్తిపరమైన నిబద్ధతతో, రోగుల పట్ల దయతో వ్యవహరిస్తూ, వారి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటూ, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, చికిత్స వ్యవస్థలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని చంద్రబాబు వివరించారు. చికిత్సకు ఖర్చు భరించలేని వారికి కూడా బాలకృష్ణ ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా వెల్లడించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఆసుపత్రిని స్థాపించామని తెలిపారు.
Next Story