Fri Nov 22 2024 12:14:43 GMT+0000 (Coordinated Universal Time)
Bay Of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం
దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్ప పీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్పై అల్పపీడనం ప్రభావం స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది 28 నాటికి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావిస్తున్నారు. ప్రభావంతో ఈ నెల 20 నుండి అక్టోబర్ మొదటి వారం వరకూ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ యుపి, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో శుక్రవారం వర్షాలు కురిశాయి. అయితే శనివారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షపాతం కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు సంభవించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story