Mon Dec 23 2024 17:23:36 GMT+0000 (Coordinated Universal Time)
మేమూ బాధితులమే: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుదీర్ఘకాలం జైలు శిక్ష గడిపిన దోషులు ఆరుగురూ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరుగురిలో ఒకరైన రవిచంద్రన్ మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని హత్యకు తమకెలాంటి సంబంధంలేదని.. తమను ఉగ్రవాదులుగానో, హంతకులుగానో చూడొద్దని కోరారు. తమను బాధితులుగా చూడాలని ప్రజలకు రవిచంద్రన్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులు ఎవరు.. స్వాతంత్ర్య సమరయోధులెవరనేది కాలమే తేలుస్తుందని.. ఉగ్రవాదులుగా ముద్రపడినప్పటికీ అదే కాలం తమను అమాయకులని తేల్చేసిందని వివరించారు. తమిళుల కోసం, తమిళ ఉద్యమం కోసం పనిచేశామే తప్ప మాజీ ప్రధాని హత్యకు జరిగిన కుట్రలో తమకు సంబంధంలేదని రవిచంద్రన్ వివరణ ఇచ్చారు. మరణశిక్ష విధించేంత తప్పు తాము చేయలేదని అన్నారు.
రాజీవ్ హత్య కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న మొత్తం ఆరుగురిని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవలే ఆరుగురు దోషులు జైలు నుంచి బయటకొచ్చారు. ఇక ఇది తమకు పునర్జన్మ అని నళిని వ్యాఖ్యానించారు. భర్త, కూతురితో మిగిలిన జీవితం గడిపేస్తానని ఆమె చెప్పారు. వెల్లూరు జైలు నుంచి నళిని విడుదలయ్యారు. నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదలకు ముందు తమిళనాడులోని వెల్లూరు పోలీసులు సాధారణ ప్రక్రియను చేపట్టారు. జైలు నుండి విడుదలకు ముందు, పెరోల్ షరతులతో కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి నళిని వెల్లూరు పోలీసు స్టేషన్కు వెళ్ళింది. రాజీవ్ గాంధీ హత్య సమయంలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాల పట్ల నళిని విచారం వ్యక్తం చేసింది. మమ్మల్ని క్షమించండని" నళిని శ్రీహరన్ మీడియాతో చెప్పింది. ఎంతో మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. వారు ఆ విషాదం నుండి బయటపడతారని నేను ఆశిస్తున్నానని నళిని శ్రీహరన్ తెలిపింది.
Next Story