Mon Dec 23 2024 07:07:37 GMT+0000 (Coordinated Universal Time)
మండపానికి మెట్రోలో వెళ్లిన పెళ్లికూతురు.. నెటిజన్లు ఏమన్నారో తెలుసా
ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ఇక ఈ వీడియో చూసిన..
పెళ్లి చేసుకోబోయే ఏ ఆడపిల్లకైనా.. అదో పెద్ద పండుగ. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పండుగ. ఉన్నంతలో పెళ్లి ఘనంగా జరగాలనుకుంటారు. మండపంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఉండాలని.. అందరూ తననే చూడాలని, అబ్బో.. ఇలాంటివి చాలానే ఉంటాయి. కానీ ఓ వధువు.. పెళ్లిమండపానికి కారులో బయల్దేరి.. మధ్యలో దిగేసి మెట్రో ఎక్కింది. పెళ్లి మండపంలో వారి దృష్టినే కాదు.. సోషల్ మీడియా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసిందో తెలుసా ? ట్రాఫిక్ కు భయపడి.
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అట్లుంటయ్ మరి! అనేలా ఉంది ఆ వీడియో. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండడంతో ముహూర్తం సమయానికి కల్యాణ మండపానికి చేరుకోలేనని భావించిన వధువు.. పెళ్లి కూతురు ముస్తాబులోనే మెట్రో ఎక్కేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లైతే.. ఆ వధువు సమయస్ఫూర్తితో ఈ పనిచేసిందని ప్రశంసిస్తూ.. ‘స్మార్ట్ పెళ్లికూతురు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. పెళ్లికూతురికి టైమ్ సెన్స్ లేదని.. ముహూర్త సమయానికి బయల్దేరడం ఏంటని పెదవి విరుస్తున్నారు. మొత్తానికి అనుకున్న సమయానికైతే పెళ్లికూతురు మండపానికి చేరింది. పెళ్లి సజావుగా జరిగింది.
Next Story