Sun Dec 22 2024 11:42:18 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాఫిక్ లో కారు ఆగగానే వరుడు జంప్.. షాక్ లో నవవధువు
ఇదే అదనుగా భావించిన వరుడు అకస్మాత్తుగా కారులోంచి దిగి పారిపోయాడు. దాంతో వధువు అవాక్కయింది.
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఆ ట్రాఫిక్ వరంగా మారింది. ట్రాఫిక్ లో వారు ప్రయాణిస్తున్న కారు ఆగగానే.. వరుడు వధువును వదిలేసి పరుగు లంకించాడు. అతడిని పట్టుకునేందుకు వధువు వెంబడించినా ఫలితం లేదు. దాంతో చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో జరగగా.. స్థానికంగా చర్చనీయాంశమైంది.
చర్చిలో అందరి సమక్షంలో ఆ జంట వివాహం చేసుకుంది. అనంతరం కారులో ఇంటికి బయల్దేరారు. మహదేవపురం వద్ద వారి కారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. ఇదే అదనుగా భావించిన వరుడు అకస్మాత్తుగా కారులోంచి దిగి పారిపోయాడు. దాంతో వధువు అవాక్కయింది. మాజీ ప్రేయసి బ్లాక్మెయిలింగ్కు దిగుతోందని వరుడు పెళ్లికి కొద్ది గంటల ముందే వధువుకు చెప్పాడట. ఆమెకు భయపడొద్దంటూ అతడికి వధువు భరోసా ఇచ్చిందట. తన కుటుంబం కూడా మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చిందట. పెళ్లికి మునుపే వరుడు తన ఎఫైర్ గురించి వధువు కుటుంబానికి చెప్పడంతో పాటూ ఆమెను వదిలేస్తానని కూడా మాటిచ్చాడని తెలుస్తోంది.
పోలీసులను ఆశ్రయించిన వధువు.. ‘‘తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని నా భర్త మాజీ లవర్ బెదిరించడంతోనే ఆయన పారిపోయాడు’’ అని నవవధువు ఫిర్యాదు చేసింది. అతను అప్పుడప్పుడు ఆత్మహత్య గురించి కూడా మాట్లాడేవాడని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని వేడుకున్నట్లు వధువు తెలిపింది. కాగా.. పరారైన వరుడు పెళ్లికి ముందు తన తండ్రి పనిచేసే కంపెనీలో డ్రైవర్ భార్యతో అఫైర్ పెట్టుకున్నాడు. ఆ విషయం ఇంట్లో తెలిసి మరో యువతితో వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే మహిళ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక అతడు ఇలా పారిపోయినట్టు సమాచారం.
Next Story