Tue Nov 19 2024 05:28:32 GMT+0000 (Coordinated Universal Time)
భయపడకండి.. ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదు.. కానీ?
డెల్టా కన్నా ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమేమీ కాదని బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా సహా ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది ఒమిక్రాన్. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ.. డెల్టా కన్నా ప్రమాదకరమేమీ కాదని అమెరికా అంటు వ్యాధుల నిపుణులు, బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ వేరియంట్ పై ఇప్పటి వరకూ వెలువడిన ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.. కానీ మరిన్ని వారాలపాటు దానిపై అధ్యయనం చేస్తే గానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదని చెప్పారు.
తీవ్రమైనది కాదు...
ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ ఒమిక్రాన్ పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వేరియంట్ కు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఒకటి వ్యాప్తి, రెండవది వ్యాక్సినేషన్, మూడవది వ్యాధి తీవ్రత ఎంత ? అనే వాటిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు.. గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తో రీ ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగానే ఉంటుంది కానీ.. ఖచ్చితంగా ఇది డెల్టా వేరియంట్ కన్నా తీవ్రమైనది కాదనిపిస్తోందని తెలిపారు. ఎందుకంటే సుమారు 43 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించినా.. ఇంతవరకూ ఒమిక్రాన్ మరణం నమోదు కాలేదన్నారు.
అంచనా వేయలేం....
ఇప్పటి వరకూ ఉన్న డేటా ఆధారంగా ఒమిక్రాన్ ను అంచనా వేయలేమని, వ్యాధి అంచనా వేయాలంటే కనీసం మరో రెండు, మూడు వారాలైనా సమయం పడుతుందన్నారు. " ఒమిక్రాన్ మూలంపై రెండు థియరీలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ రోగిలో కరోనా ఉత్పరివర్తనం చెంది ఒమిక్రాన్ పుట్టుకొచ్చి ఉండొచ్చు. లేదా కరోనా మనుషుల నుంచి జంతువులకు సోకి.. మళ్లీ వాటి నుంచి మానవులకు వ్యాప్తి చెంది ఉండొచ్చు" అని ఫౌచీ అభిప్రాయపడ్డారు. అంత ప్రమాదకరం కాదన్నామని ప్రజలకు దీనిపట్ల నిర్లక్ష్యం తగదన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించడం కూడా ముఖ్యమని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని దేశాలు మరింత వేగవంతం చేయాలని తెలిపారు.
Next Story