Fri Nov 22 2024 22:01:35 GMT+0000 (Coordinated Universal Time)
విడాకుల భరణం.. కిడ్నీ అమ్ముకుంటున్నానంటూ భర్త ప్రచారం
తాను విడాకులు ఇవ్వాలంటే.. భరణం కింద తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. తనవద్ద అంత డబ్బు లేదని..
పెళ్లి చేసుకునేటపుడు ఎంతో ఆనందంగా ఉంటారు. అది ప్రేమ వివాహమైనా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే.. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెడతారు. కానీ.. అందరూ కలకాలం కలిసి ఉండలేరు. మనస్ఫర్థలతో విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన దంపతులెందరో ఉన్నారు. అలా.. ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. తాను విడాకులు ఇవ్వాలంటే.. భరణం కింద తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. తనవద్ద అంత డబ్బు లేదని, తన కిడ్నీ అమ్మకానికి ఉందని, అది జరగని పక్షంలో మార్చి 21న ఆత్మాహుతి చేసుకుంటానంటూ ఓ వ్యక్తి బ్యానర్ తో తిరుగుతున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిందీ ఘటన. ఆ వ్యక్తి ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అదికాస్తా వైరల్ అయింది.
బీహార్ రాజధాని పాట్నాకు చెందిన సంజీవ్ కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాతే భార్య, బావమరిది, అత్తమామల అసలురూపం బయటపడింది. సంజీవ్ ను వేధించడం మొదలుపెట్టారు. దాంతో భార్యనుంచి విడాకులు కోరాడు. కానీ.. అతనికి విడాకులివ్వాలంటే రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని భార్య, అత్తమామలు భీష్మించుకుని కూర్చున్నారు. అంత ఇవ్వలేనంటూ సంజీవ్ పోలీసులను ఆశ్రయించగా.. అక్కడా నిరాశే ఎదురైంది.
అందుకే ఇలా కిడ్నీ అమ్ముకుంటున్నానని, లేనపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని బ్యానర్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ నెల 21లోగా కిడ్నీ అమ్ముడుపోతే ఆ సొమ్మును తన భార్యకు ఇచ్చి విడాకులు తీసుకుంటానని, లేదంటే అదే రోజు పాట్నాలో ఆత్మాహుతి చేసుకుంటానని పేర్కొన్నాడు. తన ఆత్మాహుతికి హాజరుకావాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తూ బ్యానర్‌పై వారి పేర్లను ముద్రించాడు. ఆ బ్యానర్ కు మరోవైపు తన భార్య, బావమరిది, అత్తమామల ఫొటోలను ముద్రించాడు.
Next Story