Mon Dec 23 2024 23:46:13 GMT+0000 (Coordinated Universal Time)
పడగవిప్పిన బర్డ్ ఫ్లూ.. 8 వేలకు పైగా కోళ్లు, బాతుల్ని చంపేయాలని అధికారుల ఆదేశం
భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్లోని ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా..
చైనాలో సృష్టింప బడిన కరోనా విలయతాండవం నుండి ప్రపంచమంతా కోలుకుంటోన్న తరుణంలో.. పాత వైరస్ లు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. కేరళలో 8 వేలకు పైగా కోళ్లు, బాతుల్ని చంపేయాలని అధికారులు ఆదేశాలివ్వడం కలకలం రేపుతోంది. అర్పూకర, తలయాజంలో బ్రాయిలర్ కోళ్ల ఫారమ్లో కూడా ఇటీవల అనేక కోళ్లు చనిపోవడంతో అనుమానంతో వాటి నమూనాలను సేకరించి పరీక్షించారు. భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్లోని ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా.. బర్డ్ ఫ్లూ సోకి బాతులు, కోళ్లు చనిపోయినట్లు ఈ పరీక్షల్లో నిర్ధారణ అయింది. దాంతో 8 వేలకు పైగా కోళ్లు, బాతులు, పెంపుడు పక్షుల్ని చంపేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
కొట్టాయం జిల్లాలోని అర్పూక్కర, తల యాజమ్ పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ తెలిపారు. వెంటనే బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు చేపట్టారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఒక కిలోమీటరు పరిధిలోని 8 వేలకు పైగా పెంపుడు పక్షులను చంపాలని.. అనంతరం ఆ ప్రాంతంలో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. బుధవారం (డిసెంబర్ 13) నుంచి మూడు రోజుల పాటు బర్డ్ ఫ్లూ వ్యాధి కేంద్రంగా ఉన్న పది కిలోమీటర్ల పరిధిలో కోళ్లు, బాతులు,పక్షులు, ఇతర పెంపుడు పక్షుల, కోడి, బాతు గుడ్లు, మాంసం సహా సేంద్రీయ ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కొట్టాయం, వైకోమ్, ఎట్టుమనూర్ మున్సిపాలిటీల స్థానిక స్వపరిపాలన సంస్థలు.. వేచూర్, కురుప్పంతర, తలయాజ్జం, తలయోలపరంబు, కల్లార, నందూర్, టీవీ పురం, కడుతురుత్తి, ఉదయనపురం, కుమరకొం, అర్పుక్కర, ఐమానం, అతిరంపూజ, తిరువార్పు పంచాయతీల్లో 10 కిలోమీటర్ల మేర జంతువులు అసాధారణ రీతిలో మరణిస్తే.. వెంటనే అధికారులకు లేదా స్థానిక పాలకవర్గానికి సమాచారమివ్వాలని సూచించారు. బర్డ్ ఫ్లూ ప్రజలకు వ్యాపించే వైరస్ కానప్పటికీ..మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిదని సూచించారు.
Next Story