Mon Dec 23 2024 04:45:06 GMT+0000 (Coordinated Universal Time)
మెహందీ ఫంక్షన్లో తండ్రి మృతి.. వధువుకి చెప్పకుండా వివాహం
మెహందీ వేడుకలో వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను..
ఆడపిల్ల పెళ్లి తనకున్నంతలో ఘనంగా చేయాలన్నది ప్రతి తండ్రి కల. కూతురికి మంచి భర్తను తీసుకురావాలని ఆమె పుట్టినప్పటి నుండే ఆలోచించే తండ్రులున్నారు. కుమార్తె వివాహ వేడుక మెహందీ ఫంక్షన్ తో ఘనంగా ప్రారంభమైంది. ఆ ఫంక్షన్లో కూతురికి పెళ్లవుతుందని తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. తీరా చూస్తే.. ఆయన గుండెపోటుతో మరణించాడు. తండ్రి కోరిక మేరకు పెళ్లివేడుక ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరగాలన్న ఉద్దేశ్యంతో.. ఈ విషయాన్ని వధువుకు చెప్పకుండా వివాహం జరిపించారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జరిగిందీ ఘటన.
మెహందీ వేడుకలో వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం కుమార్తెకు తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భావించిన కుటుంబ సభ్యులు.. కొండంత దుఃఖాన్ని గుండెలో దాచిపెట్టుకుని ఆదివారం హల్ద్వానీలోని ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరిపించారు. కన్యాదానాన్ని వధువు తండ్రి కాకుండా మేనమామ నిర్వహించేందుకు రావడంతో వధువు నిరాకరించింది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరీక్షల కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, వచ్చేస్తారని చెప్పి కన్యాదానం జరిపించారు. వివాహం అనంతరం తన తండ్రి ఇక లేరని తెలిసి.. ఆ వధువు బోరున విలపించింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదంటూ తల్లడిల్లిపోయింది. ఆమెను చూసి బంధువులంతా కన్నీరు పెట్టుకున్నారు.
Next Story