Mon Dec 23 2024 04:40:51 GMT+0000 (Coordinated Universal Time)
Akash Anand : మాయావతి వల్ల కానిది...ఆకాశ్ ఆనంద్ వల్ల సాధ్యమవుతుందా?
తన రాజకీయ వారసుడిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆకాశ్ ఆనంద్ పేరును ప్రకటించారు
ప్రాంతీయ పార్టీలకు వారసులు వచ్చేస్తారు. జాతీయ పార్టీలది వేరు. ప్రాంతీయ పార్టీలుగా ప్రారంభమై జాతీయ పార్టీలుగా మారినప్పటికీ వారి కుటుంబాల నుంచే వారసులు వస్తుంటారు. ఎవరూ దీనికి అతీతులు కారు. తమ కుటుంబ సభ్యులకే పార్టీ పగ్గాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తుంది. పార్టీ క్యాడర్ కూడా అందుకు ఆమోదం తెలుపుతుంది. ఇందులో పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా వచ్చిన వారసుడు పార్టీని ఎంత వరకూ డెవలెప్ చేస్తాడన్నదే చర్చ. వారసుడి హయాంలో పార్టీ పుంజుకుంటుందా? లేదా? అన్న అనుమానం మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
తన తర్వాత...
తాజాగా ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన వారసుడిని ప్రకటించేశారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ పేరును మాయావతి అధికారికంగానే ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్ పేరు ఇప్పటి నుంచి కాదు... గతకొంతకాలంగా ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో వినపడుతూనే ఉంది. గత దశాబ్దాలుగా ఉత్తర్ప్రదేశ్ లోనూ మాయావతి పార్టీ బీఎస్పీ పెద్దగా రాణించలేకపోతుంది. దళిత ఓటు బ్యాంకుతో పాటు అన్ని సామాజికవర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నం చేసినా అధికారానికి దరిదాపుల్లోకి కూడా రాలేదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా...
చివరకు ఒకదశలో తనకు అత్యంత బద్ధ శత్రువైన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీఎస్పీని ప్రజలు ఆశీర్వదించలేదు. ఆదరించలేదు. అయినా మాయావతి నేతృత్వంలో ఉన్న ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా ప్రత్యేకత ఉంది. గుర్తింపు ఉంది. ఐరన్ లేడీగా పేరున్న మాయావతి ఎప్పటికైనా ఉత్తర్ప్రదేశ్ ను మరోసారి శాసిస్తారని భావించే వారు అనేక మంది ఉన్నారు. మాయావతి తన మాటలతో మ్యాజిక్ చేస్తారు. దేశ వ్యాప్తంగా పోటీ చేయించి బీఎస్పీకి జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చారు.
అనేక అనుమానాలు...
అయితే ఆమె తన వారసుడిగా ఆకాశ్ ఆనంద్ పేరును ప్రకటించడంతో ఆనంద్ పార్టీని ఎంత వరకూ అభివృద్ధి చేస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. మాయావతి తమ్ముడి కుమారుడే ఆకాశ్ ఆనంద్. 2016లో బీఎస్పీలో చేరిన ఆనంంద్ 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇన్నాళ్లూ మాయావతి వెనక ఉండి ఆయన రాజకీయాలను చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేరుగా ముందుకు రానున్నారు. ఆకాశ్ ఆనంద్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మాయావతి వారసుడు వచ్చేశాడంటూ ఆ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story