Thu Dec 12 2024 20:39:50 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం... వారందరికీ ఐదు లక్షల ఉచిత బీమా
కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది
కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. డెబ్భయి ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ దేశంలో ఐదు లక్షల రూపాయల ఉచిత బీమాను అమలు పర్చనుంది. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ కింద అందరికీ ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అందుకు కావాల్సిన అర్హతలు కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యం లభిస్తుందని తెలిపింది.
అర్హతలివే...
డెబ్భయి ఏళ్లు నిండిన పురుషులు, మహిళలు ఈ పథకం కింద అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకోసం కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డు కూడా కేవలం వయసును ధృవీకరించడానికి మాత్రమేనని, ఆ ఒక్క ఆధారం ఉంటే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా పథకం అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అంతే తప్ప ఇతర పత్రాలు అవసరం లేదని పేర్కొంది. 70 ఏళ్లు వయసు నిండిన వారంతా ఈ పథకం పొందడానికి అర్హులేనని చెప్పింది. ఆదాయం, సామాజికస్థితి, వృత్తితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ అందరికీ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. https://beneficiary. nha.gov.in/ పోర్టల్ ద్వారా పీఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ఆయుష్మాన్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. పథకంలో చేరినవారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ వయ వందన కార్డును అందజేస్తారు. డిజిటల్ కార్డులూ అందుబాటులో ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే, మొదటి వ్యక్తి వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత ‘యాడ్ మెంబర్’పై క్లిక్ చేసి మరొకరి వివరాలను నమోదు చేయాలి. ఒక్కొక్కరికి వేర్వేరుగా నమోదు చేయనక్కర్లేదు.
ఎక్కువ మంది ఉంటే?
ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులైన వృద్ధులు ఉంటే, వారంతా కలిసి ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం చేకూరుతుంది. అంటే, కుటుంబానికి రూ.5 లక్షల వరకు మాత్రమే లబ్ధి పొందడానికి వీలవుతుంది. ఇప్పటికే ఆయుష్మాన్ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లో 70 ఏండ్లు, ఆ పైబడిన వారుంటే.. వారికి అదనంగా ఏడాదికి రూ.5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 16,691 ప్రభుత్వ ఆసుపత్రులు, 13,078 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ పథకం అమలవుతుంది.
Next Story