కోట్లాది మంది ఆశలను మోస్తూ.. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్- 3
చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టింది.
చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు బాహుబలి ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముకుంటూ, కోట్లాది మంది ఆశలను మోస్తూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్-3 యాత్రలో భాగంగా ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్ చంద్రుడి దగ్గరకు బయల్దేరింది.
ఈ రాకెట్ చంద్రయాన్-3ని భూమి చుట్టూ ఉన్న 170X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా దీని కక్ష్యను పెంచుతూ.. చంద్రుడి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరుస్తారు. పలు ప్రక్రియల అనంతరం చివరగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు. స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుండి చంద్రునికి దగ్గరకి వెళ్లడానికి దాదాపు ఒక నెల సమయం పడుతుంది.
ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోయి.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుందని ఇస్రో తెలిపింది. ల్యాండింగ్ తర్వాత.. ఇది ఒక చాంద్రమాన రోజు పని చేస్తుంది, ఇది దాదాపు 14 భూమి రోజులు. చంద్రునిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం.చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కిలోగ్రాములు. చంద్రయాన్-3.. భారతదేశం యొక్క మూడవ చంద్ర అన్వేషణ మిషన్, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యేలా చేయడం, రోవర్ సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్.. ఈ మిషన్ మొదటి లక్ష్యాలు.