Mon Dec 23 2024 04:29:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రయాన్-3: విక్రమ్ విడిపోయింది
చంద్రయాన్–3 లో భాగంగా అంతరిక్ష నౌక నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది
చంద్రయాన్–3 లో భాగంగా అంతరిక్ష నౌక నుంచి ల్యాండర్ ‘విక్రమ్’ విడిపోయింది. ఈ రోజు నుంచి ల్యాండర్ చంద్రుడి చుట్టూ తిరగనుంది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన విషయాన్ని ఇస్రో వెల్లడించింది. ఎల్ఎం (ల్యాండర్ మాడ్యూల్) విజయవంతంగా ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) నుంచి వేరుపడిందని.. రేపు నిర్వహించే డీబూస్టింగ్ తర్వాత.. ల్యాండర్ మాడ్యూల్ మెల్లగా లోవర్ ఆర్బిట్ లోకి వెళ్తుందని ఇస్రో తెలిపింది. ఆగస్టు 18 సాయంత్రం 4 గంటలకు డీబూస్టింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్‌ను డీబూస్ట్ (వేగాన్ని తగ్గించే ప్రక్రియ) చేయనున్నారు. పెరిలున్ (చంద్రుడికి అత్యంత దగ్గరి ప్రదేశం)కు 30 కిలోమీటర్లు, అపోలూన్ (చంద్రుడకి దూరంగా ఉన్న ప్రదేశం)కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ల్యాండర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్బిట్‌లోకి ల్యాండర్ చేరుకున్న తర్వాత 23వ తేదీన సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించనున్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన వెంటనే ప్రజ్ఞాన్ రోవర్ ఫొటోను ల్యాండర్ తీయనుంది. రోవర్ తన పరిశోధన ప్రారంభిస్తుంది. చంద్రునిపై దిగేముందు లాండర్ వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ నిట్ట నిలువునా చంద్రుడు ఉపరితలంపై దింపడమే చంద్రయాన్ 3 ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశ. దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్న లాండర్ మోడ్యుల్ వేగాన్ని తగ్గిస్తూ, గమనాన్ని మారుస్తూ నిట్ట నిలువుగా చంద్రుడి పైకి దింపే దశ అత్యంత క్లిష్టమైనదిగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇప్పటికే తెలిపారు.
Next Story