Mon Dec 15 2025 03:53:08 GMT+0000 (Coordinated Universal Time)
కునో పార్కులో మరో చీతా కూన మృతి
చీతా కూనను ఆస్పత్రికి తరలించిన 10 నిమిషాలకే అది మృతి చెందిందని ఆయన పేర్కొన్నారు. బలహీనంగా ఉండటంతోనే..

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టిన చీతాలు వరుసగా మృత్యుఒడిలోకి చేరుతున్నాయి. రెండు నెలల్లో నాలుగు చీతాలు మృతి చెందాయి. ఇప్పటికే మూడు చీతాలు మరణించగా.. తాజాగా 2 నెలల వయసుగల చీతా కూన ప్రాణాలు కోల్పోయింది. పార్కులో పర్యవేక్షక బృందం పరిశీలించినపుడు ఆ కూన చాలా బలహీనంగా కనిపించడంతో వెటర్నరీ వైద్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించామని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ తెలిపారు.
చీతా కూనను ఆస్పత్రికి తరలించిన 10 నిమిషాలకే అది మృతి చెందిందని ఆయన పేర్కొన్నారు. బలహీనంగా ఉండటంతోనే అది మరణించిందన్న ఆయన.. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన వాటిలో సాషా అనే చీతా కిడ్నీ సంబంధిత సమస్యలతో మార్చి 27న మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాల్లో ఉదయ్ ఏప్రిల్ 13న మరణించగా, సౌతాఫ్రికా నుంచే తెచ్చిన మరో చీతా దక్ష మరో చీతాతో జరిగిన పోరాటంలో తీవ్రంగా గాయపడి మే 9న ప్రాణాలు కోల్పోయింది.
కునో పార్కులో చీతా జ్వాల (సియాయా) మార్చి 24న నాలుగు కూనలకు జన్మనిచ్చింది. వీటితో కలిపి 24కు పెరిగిన చీతాల సంఖ్య.. రెండు నెలల్లో నాలుగు చీతాలు మృతి చెందడంతో మళ్లీ 20కి చేరింది. ప్రస్తుతం అక్కడ 17 చీతాలు, మూడు చీతా కూనలు ఉన్నాయి.
Next Story

