Fri Dec 27 2024 11:46:25 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నై ఎయిర్ పోర్టుకు ఊహించని కష్టాలు
మిచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తూ ఉంది. భారీ వర్షాల కారణంగా
మిచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తూ ఉంది. భారీ వర్షాల కారణంగా చెన్నైను భారీ వర్షం ముంచెత్తింది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయమని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా చెన్నై విమానాశ్రయం కార్యకలాపాలు నిలిపివేశారు. 12 దేశీయ విమానాలు, నాలుగు అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా మూడు అంతర్జాతీయ విమానాలను బెంగళూరుకు మళ్లించారు. ఎయిర్పోర్ట్ రన్వేలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో విమానాలు నిలిచిపోయిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈరోజు రాత్రి 11 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
చెన్నైలో దిగాల్సిన దేశీయ అంతర్జాతీయ విమానాలను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఇండిగో, స్పైస్ జెట్, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్, ఫ్లై దుబాయ్, ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, చెన్నె నుండి బెంగళూరుకు వెళ్లే విమానాలను దారి మళ్లించారు. రానున్న గంటల్లో మరిన్ని విమానాలను బెంగళూరుకు మళ్లించే అవకాశం ఉందని అధికారులు ధృవీకరించారు. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో విద్యుత్తు అంతరాయం, ఇంటర్నెట్ అంతరాయాలు కనిపించాయి. చెన్నైలో ఈరోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని కోరింది.
Next Story