Sun Dec 22 2024 19:28:24 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్య రాములోరి కల్యాణానికి కోనసీమ నుంచి కొబ్బరిబోండాలు
అయోధ్య రామమందిరం విగ్రహ ప్రతిష్టాపనకు కోనసీమలోని మండపేట నుంచి కొబ్బరి బోండాలు నేడు చేరుకోనున్నాయి
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దేశమంతా రామనామం మోగుతుంది. తమ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాటిని రామయ్యకు కానుకగా ఇచ్చేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. అందులో భాగంగా కోనసీమ నుంచి కొబ్బరిబోండాలను ప్రత్యేకంగా ఇక్కడి నుంచి అయోధ్యకు పంపుతున్నారు. రాములోరి కల్యాణానికి ఉపయోగించే విధంగా కల్యాణ బోండాలను కోనసీమ ప్రాంతం నుంచి నేడు బయలుదేరి అయోధ్యకు వెళ్లనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మండపేట నుంచి...
కోనసీమలోని మండపేట నుంచి ఈ కొబ్బరిబోండాలను తరలించారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం రోజు వినియోగించేందుకు ప్రత్యేకంగా వీటిని తయారు చేశారు. కోనసీమ కొబ్బరిబోండాలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడి నుంచి అయోధ్యలోని సీతమ్మ ఆశ్రమం అభ్యర్థన మేరకు శంకు, చక్ర, నామాలతో రూపొందించిన కొబ్బరి బోండాలను రామ మందిర ప్రారంభోత్సవానికి పంపారు. మండపేటకు చెందిన మహాలక్ష్మి, రామారెడ్డి దంపతులు ఈ కొబ్బరి బోండాలను ప్రత్యేకంగా తయారు చేయించి పంపారు.
ప్రత్యేకంగా తయారు చేసి...
అయోధ్యకు మండపేట నుంచి కొబ్బరి బోండాలు పంపమని కోరడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈరోజు కొబ్బరి బోండాలు అయోధ్యకు చేరుకుంటాయని వారు చెప్పారు. శ్రీసీతారాముల కల్యాణ వేడుకలో మండపేటకు చెందిన కొబ్బరి బోండాలను వినియోగించడం మనకు గర్వకారణమని వారంటున్నారు. కోనసీమ కొబ్బరి బోండాలు పంపమని కోరడమే తాము చేసుకున్న పూర్వ జన్మ సుకృతమని వారు చెబుతున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కోనసీమ కొబ్బరి బోండాలు ప్రత్యేకంగా కనిపించనున్నాయి.
Next Story