Fri Dec 20 2024 19:46:38 GMT+0000 (Coordinated Universal Time)
Bharat Nyay Yatra : యాత్ర వల్ల ఉపయోగం ఉందా... ఇమేజ్ పెరుగుతుందే కానీ.. పార్టీ గేజ్ మారుస్తుందా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఆయన కాలు కదపబోతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి భారత్ న్యాయ యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఆయన కాలు కదపబోతున్నారు. అయితే ఏ మేరకు ఆయన యాత్ర ప్రభావం పనిచేస్తుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నిర్వహించిన భారత్ జోడో పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ సాగింది. అయితే కారణాలు ఏవైనా కర్ణాటక, తెలంగాణలో మాత్రమే పార్టీ అధికారంలోకి రాగలిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అది అధికారంలోకి రాలేకపోయింది.
భిన్నాభిప్రాయాలు...
దీంతో భారత్ జోడో యాత్ర ప్రభావం పెద్దగా లేదని కాంగ్రెస్ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పాదయాత్రతతో రాహుల్ పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ కర్ణాటకలో గెలవడానికి అక్కడ అప్పటి వరకూ అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత మాత్రమే కాంగ్రెస్ గెలవడానికి దోహదపడిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కూడా ఆ యా రాష్ట్రాల్లో పనిచేశాయనే వారు కూడా ఉన్నారు. అంతే తప్పించి భారత్ జోడో యాత్ర కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న అభిప్రాయమూ ఉంది.
మరోసారి యాత్రతో...
ఈ సమయంలో మరోసారి భారత్ న్యాయయాత్ర పేరిగ రాహుల్ గాంధీ 6,200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. మణిపూర్ లో జనవరి 14వ తేేదీన మొదలయి మార్చి 20వ తేదీన ముగిసేలా రూట్ మ్యాప్ ను కాంగ్రెస్ నేతలు రూపొందించారు. పథ్నాలుగు రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుండటంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ భారత్ న్యాయయాత్ర ఖచ్చితంగా పనిచేస్తుందని పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. సాధారణ పౌరుడిగా అందరితో మమేకం అవుతూ రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రయత్నం పార్టీకి ఖచ్చితంగా విజయం సాధించిపెడుతుందని నమ్ముతున్నారు.
ఉత్తరాదిలో మాత్రం...
కానీ కాంగ్రెస్ ను దేశంలో చూస్తే ఒక్క దక్షిణాదిలో తప్ప ఎక్కడా ఆశించిన ఫలితాలు సాధించలేని పరిస్థితి ఉంది. ఇండియా కూటమి కూడా సమావేశాలు జరుపుతున్నా ఎన్నికల సమయానికి కూటమిలో పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది చెప్పలేని పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ మాత్రం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితమయినా కాంగ్రెస్ ను ఈ మాత్రం గాడిలో పెట్టగలిగారంటే అది రాహుల్ యాత్ర వల్లనే సాధ్యమయిందన్న కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీ మరోసారి చేపట్టిన పాదయాత్ర ఎంత వరకూ పార్టీకి ఉపయోగపడుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story