Thu Dec 19 2024 23:55:14 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : లేటయినా.. లేటెస్ట్గా రా భయ్యా.. లేకుంటే వీళ్లింతే.. మారరు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా కూటమిలో ఉన్న నేతల బయోడేటాను పరిశీంచాలి. లేకుంటే నవ్వుల పాలు కాక తప్పదు
ఒక మమత బెనర్జీ.. ఒక నితీష్ కుమార్.. ఒక కేజ్రీవాల్.. ఒక అఖిలేష్ యాదవ్.. వీరితో కలసి ప్రయాణించ దలచుకుంటే కాంగ్రెస్ ఎప్పటికీ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశముండదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల నేతలకు వారి వారి రాష్ట్రాల్లో వారి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఒకసారి తాము ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమయితే తమకు పుట్టగతులు కూడా ఉండవన్న సంగతి వారికి తెలియంది కాదు. అందుకే కాంగ్రెస్ తో చెలిమి అంటూనే మరొక వైపు మా రాష్ట్రంలో జాన్తానై అనడం మామూలయి పోయింది.
నెలలు గడవక ముందే...
మహా కూటమి ఏర్పడి నెలలు గడవక ముందే ప్రజల ముందు నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. కారణాలు ఏవైనా కావచ్చు. అది కాంగ్రెస్ నేతల తప్పిదం కావచ్చు. లేదా ప్రాంతీయపార్టీల అధినేతల ఆగ్రహం కావచ్చు. ప్రజల్లో ఇండియా కూటమిపై నమ్మకం సన్నగిల్లేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరసగా మమత బెనర్జీతో మొదలయి అఖిలేష్ యాదవ్ వరకూ ఇదే తంతు. తమ రాష్ట్రమైన బెంగాల్ తో కాంగ్రెస్ తో కలసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేమని మమత స్పష్టం చేసింది. దీంతో అక్కడ కాంగ్రెస్ కమ్యునిస్టులతో కలసి మాత్రమే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బతిమాలాడాల్సిన పరిస్థితి...
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏకంగా కూటమికి కటీఫ్ చెప్పి ఎన్డీఏ లోకి వెళ్లిపోయారు. ఆయన స్వార్థం ఆయనది. ఇక తాజాగా అఖిలేష్ కుమార్ యాదవ్ కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పదకొండు స్థానాలకు మించి ఇవ్వబోమని చెప్పేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను సమాజ్ వాదీ పార్టీ శాసించే విధంగా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలున్నాయి. సీట్లకోసం అఖిలేష్ ను బతిమాలాడుకోవాల్సిన పరిస్థితి నూరేళ్ల చరిత్రకలిగిన కాంగ్రెస్ కు పట్టిందంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుంది.
ఎవరో ఒకరిని...
అందుకే కాస్త లేటయినా లేటెస్ట్గా రావడం మంచిదన్న అభిప్రాయం నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తల్లో కనపడుతుంది. ఎప్పుడూ ఎవరో ఒకరిని కలుపుకుని పోయే కంటే మోదీని సొంతంగా ఎదుర్కొనే శక్తిని సంపాదించడమే కాంగ్రెస్ కు ఉన్న ఏకైక మార్గం. లేకుంటే ఎప్పుడు కూటములకు కొత్త పేర్లు అయితే పెట్టొచ్చు కాని... పరిస్థితిలో మాత్రం మార్పు ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇప్పటికైనా కొంత ఆలోచించడం మంచిది. రాహుల్ గాంధీ చిన్న వయసులోనే ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సిన పని ప్రతి రాష్ట్రంలో బలోపేతం కావడం. అలా పార్టీ బలంగా ఉంటేనే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముంది. అంతే తప్ప కూటములు కట్టుకుని, వారిని నమ్ముకుని ఎన్నికల గోదాలోకి దిగితే ఎన్నిసార్లైనా అభాసుపాలు కాకతప్పదు. అది ఇప్పటికైనా రాహుల్ తెలుసుకుని పార్టీని బలోపేతం చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Next Story