Tue Nov 05 2024 08:11:03 GMT+0000 (Coordinated Universal Time)
Jammu Kashmir Elections : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫేస్టో చూస్తే కళ్లు తిరగాల్సిందే
జమ్మూ కాశ్మీర్ లోనూ కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫేస్టోను ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎక్కడ ఎన్నికలు జరిగినా దూకుడును ప్రదర్శిస్తుంది. ప్రధానంగా మ్యానిఫేస్టోతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. హామీలను గ్యారంటీల రూపంలో ఉంచుతూ ప్రజల ముందుకు వెళ్లి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతుంది. అందుకే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఎలాగైనా జమ్మూ కాశ్మీర్ లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులను ఒడ్డుతుంది. హామీలతో ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తుంది.
రైతులే లక్ష్యంగా...
అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లోనూ కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫేస్టోను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే కిలో యాపిల్ కు కనీస మద్దతు ధర 72 రూపాయలు ప్రకటిస్తామని తెలిపింది. కాశ్మీర్లో యాపిల్ దిగుబడులు ఎక్కువ వస్తుండటంతో రైతులను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రధానంగా వారిపైనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. రైతులను ఆకట్టుకునేందుకు అనేక రకాలుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా యాపిల్ పంట పండిస్తున్న రైతులను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళికలను రూపొందించింది.
యువత కోసం...
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తామని హామీల్లో ప్రధాన హామీగా పేర్కొన్నారు. భూమిలేని, కౌలుదారులకు ఏడాదికి అదనంగా నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం అందచేస్తామని తెలిపింది. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు వాటిని 99 ఏళ్ల లీజుకు ఇస్తామని కూడా పేర్కొంది. ఇక యువతను ఆకట్టుకునేందుకు అధకిారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని మ్యానిఫేస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. ఇక అర్హులైన నిరుద్యోగులకు ప్రతి నెల 3,500 రూపాయలు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని తెలిపింది. రేపు జమ్మూ కాశ్మీర్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నియోజవర్గాల్లో ప్రచారం ముగిసింది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 46 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. అందుకే తొలి విడత జరిగే 24 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ తన మ్యానిఫేస్టోను విడుదల చేసి ప్రజల్లోకి వెళ్లింది.
Next Story