Sat Dec 21 2024 05:14:04 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : రాహుల్ పై శర్మగారికి అంత కోపమెందుకు? నాడు జరిగిన అన్యాయం ఆ అడుగులో గుర్తుకొస్తుందా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర నేడు పదో రోజుకు చేరుకుంది. అసోంలో ఆయన యాత్ర జరుగుతుంది.
Rahul Gandhi's Bharat jodo nyaya yatra in Assam:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర నేడు పదో రోజుకు చేరుకుంది. అసోంలో ఆయన యాత్ర జరుగుతుంది. మణిపూర్ లో ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు. గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అయితే ఎక్కడా ఆయన పాదయాత్రను అడ్డుకోలేదు. అయితే అసోంలో మాత్రం ఆయన యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆలయంలోనికి ప్రవేశం లేదంటారు. విద్యాసంస్థల్లోకి నో ఎంట్రీ అంటారు.. ఇలా ఒక్కటేమిటి.. మౌనంగా అసోంలో తలదించుకుని వెళ్లమన్నట్లుంది ప్రభుత్వ వ్యవహారం.
అడుగడుగునా నిబంధనలు...
నిజానికి ఎక్కడా అమలు కాని నిబంధనలు.. ఆంక్షలు ఒక్క అసోంలోనే ఎందుకు ఎదురవుతున్నాయన్నది అసలు ప్రశ్న. ఆలయంలోకి అడుగుపెట్టకుండా రాహుల్ ను నిన్న అడ్డుకుంటే ఈరోజు గౌహతి నగరంలోకే యాత్ర ప్రవేశించడానికి లేదని నిషేధాజ్ఞలు విధించారు. గౌహతిలోకి రాహుల్ వెళ్లకుండా బ్యారికేడ్లను పోలీసులు అడ్డంగా పెట్టారు. అయినా ఆ బారికేడ్లను తోసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు గౌహతి నగరంలోకి ప్రవేశించారనుకోండి. అయితే ఎక్కడా లేని విధంగా ఒక్క అసోంలోనే ఎందుకు ఇన్ని ఆటంకాలు అన్న ప్రశ్నలు సహజంగానే అందరి మెదళ్లో మెదులుతున్నాయి. అయితే ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయని చెప్పకతప్పదు.
ముందుగానే నిర్ణయించిన ప్రకారమే...
రాహుల్ గాంధీ జాతీయ నేత. ఎక్కడకు వెళ్లైనా తన పార్టీ కోసం ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించుకుండా ఆయన ప్రజల్లోకి వెళితే ఏ ప్రభుత్వమైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అయినా సరే ఒకవేళ అనుమతి తెచ్చుకోవాల్సి వస్తే అంతదాకా కూడా కాంగ్రెస్ నేతలు వెళతారు. రాహుల్ గాంధీ యాత్ర ముందుగా నిర్ణయించుకున్నదే. రూట్ మ్యాప్ కూడా ముందుగా సిద్ధం చేసిందే. అయితే అసోంలో మాత్రం రాహుల్ ను అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రత సిబ్బందికి తోడుగా ఆ యా రాష్ట్ర పోలీసులు ఆయనకు సెక్యురిటీ కల్పించాల్సిన వారు అడ్డు చెప్పడం ఎంతవరకూ సబబని ప్రశ్నలు వినపడుతున్నాయి.
కాంగ్రెస్ నుంచి వెళ్లి...
ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఆయన పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా ముద్రపడ్డారు. నాడు అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి శిబిరాన్ని నడిపాడు. అయితే టెన్ జన్పథ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హేమంత బిశ్వశర్మ కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు. అప్పటి వరకూ బీజేపీలో ఉన్న నేతలను పక్కన నెట్టి తాను ముఖ్యమంత్రి కాగలిగాడంటే. అతగాడి నేర్పరితనం ఇంత అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అలాంటి హిమంత తన ఇలాకాలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ అయితే బీజేపీ హైకమాండ్కు ఎక్కడ ఆగ్రహం వస్తుందనో ఏమో అడగుగడుగునా అడ్డుకుంటున్నారు. అయితే ఆయనకు తెలియంది ఏంటంటే.. రాహుల్ యాత్రను అడ్డుకుంటే కాంగ్రెస్ కే లాభం చేకూరుతుంది. అదే ఇప్పుడు అసోంలో జరుగుతుంది. మరి అసోం నుంచి పాదయాత్ర ముగిసేలోగా మరెన్ని ఆటంకాలు ఎదురవుతాయన్న సందేహాలు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
Next Story