మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్.. గోమూత్రంతో కర్ణాటక విధాన సౌధ శుద్ధి
కర్ణాటకలోని విధానసౌధలో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం శుద్ధి కర్మలు చేశారు. విధానసౌధ ఎదుట గోమూత్రంతో పూజారితో పాటు
బెంగళూరు: కర్ణాటకలోని విధానసౌధలో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం శుద్ధి కర్మలు చేశారు. విధానసౌధ ఎదుట గోమూత్రంతో పూజారితో పాటు అధికార పార్టీ కార్యకర్తలు శుద్ధి చేశారు. మూడు రోజుల కొత్త అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆచారాల్లో భాగంగా గోమూత్రాన్ని చల్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా బీజేపీకి కౌంటర్‌గానే కనిపిస్తోంది. బీజేపీ అవినీతితో విధానసౌధను కలుషితం చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత విధానసౌధను డెట్టాల్, గోమూత్రంతో శుద్ధి చేస్తామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ జనవరిలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రిగా శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏనిమిది మంది మంత్రులూ బాధ్యతలు తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం 40 శాతం కలుషితం చేసిన విధానసౌధను శుద్ధి చేసేందుకే ఈ పూజలు చేశామని పాల్గొన్న వారిలో ఒకరు విలేకరులతో అన్నారు.
విధానసౌధ నుంచి అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని కడిగిపారేయడానికి ఆచార వ్యవహారాలు ప్రతీక అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల చర్యను 'చిల్లర చేష్టలు'గా బీజేపీ అభివర్ణించింది. గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని ఆ పార్టీకి చెందిన ఓ నేత కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. మరో వైపు సిద్దరామయ్య గత బీజేపీ ప్రభుత్వంపై కౌంటర్లు వేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మతం కార్డు అన్ని చోట్లా పని చేయదు అంటూ విమర్శిస్తున్నారు. ఏదీ ఏమైనా కర్ణాటక విధాన సభ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పని బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది.