మణిపూర్ ఘటనపై సుప్రీం సీరియస్.. సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
మణిపూర్ లో జరిగిన ఈ ఘటనకు.. బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు..
కొద్దిరోజులుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో దారుణమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడి వారిని నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై యావత్ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మొదటు.. సినీ, రాజకీయ ప్రముఖులంతా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వెంటనే మహిళలను నగ్నంగా ఊరేగించే వీడియోలను తొలగించాలని ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలకు సహకరించాలని కేంద్రం ఆదేశాల్లో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విట్టర్ పై కేంద్రం చర్యలు తీసుకుంటామని తెలిపింది.