Wed Apr 02 2025 17:26:41 GMT+0000 (Coordinated Universal Time)
15 రోజుల్లో భారీగా పెరగనున్న కరోనా కేసులు : ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్
మే లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 60 వేల వరకు నమోదు కావొచ్చని ఆయన తెలిపారు. ఇందుకు రెండు కారణాలను వ్యక్తం చేశారు.

పూర్తిగా పోయిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండటంతో.. యాక్టివ్ కేసులు 50 వేలు దాటాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మణీంద్ర అగర్వాల్ కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే నెలలో కరోనా రోజువారీ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుతాయని ఆయన అంచనా వేశారు.
మే లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 60 వేల వరకు నమోదు కావొచ్చని ఆయన తెలిపారు. ఇందుకు రెండు కారణాలను వ్యక్తం చేశారు. తొలి రెండు విడతల్లో కరోనా వైరస్ అనేకమందికి సోకడంతో.. ఇప్పుడు 5 శాతం మంది ప్రజల్లో కరోనాపై పోరాడే రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గినట్టు డాక్టర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందడం కేసుల పెరుగుదలకు రెండో కారణంగా పేర్కొన్నారు. అయితే 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో 50-60 వేల కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండటం ఆందోళన చెందాల్సినంత పెద్ద విషయం కాదన్నారు. దగ్గు, జలుబు వంటి వాటికి ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని, కోవిడ్ ను సాధారణ ఫ్లూ గానే చూడాలని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.
Next Story