Sun Dec 22 2024 11:39:57 GMT+0000 (Coordinated Universal Time)
బంగాళాఖాతంలో అశని తుపాను.. ఏపీకి ముప్పు ఉందా ?
అల్పపీడనం చాలా వేగంగా కదులుతోందని అధికారులు తెలిపారు. రేపటికి దాని వేగం.. 25 నాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రేపు ఉదయానికి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. తీవ్రవాయుగుండంగా మారిన 24 గంటలకు బంగాళాఖాతంలో తుపానుగా పరిణామం చెందుతుందని పేర్కొంది. తుపాను ఈనెల 10 నాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరానికి చేరుతుందని, 10, 11 తేదీల్లో విశాఖపట్నం - భువనేశ్వర్ ల మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
కాగా.. అల్పపీడనం చాలా వేగంగా కదులుతోందని అధికారులు తెలిపారు. రేపటికి దాని వేగం.. 25 నాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తుపానుగా మారిన తర్వాత మే 10 నాటికి దానివేగం 45 నాట్లకు పెరుగుతుందని చెప్తున్నారు. కాగా.. ఈ తుపాను వల్ల భయపడాల్సిందేమీ లేదని ఐఎండీ తుపాను పర్యవేక్షణ విభాగం ఇన్ చార్జ్ ఆనంద కుమార్ దాస్ చెప్పారు. తుపానుపై అంచనాలు వేగంగా మారుతున్నాయన్న ఆయన.. ఆదివారం నాటికి పూర్తి స్పష్టత వస్తుందన్నారు. తుపాను ఏపీ, ఒడిశా తీరాలను తాకకుంటే.. యూటర్న్ తీసుకుని మళ్లీ సముద్రంలోకే చేరే అవకాశం ఉందని, బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలూ ఉన్నాయని చెప్తున్నారు. మే 10న గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తుపానుకు అశని అనే పేరును పరిశీలిస్తున్నారు. అశని అంటే సింహళ భాషలో కోపం, ఆగ్రహం అని అర్థం.
Next Story