Tue Nov 05 2024 23:31:27 GMT+0000 (Coordinated Universal Time)
బిపోర్ జాయ్ విధ్వంసం : 800 వృక్షాలు నేలమట్టం, 500 ఇళ్లకు దెబ్బ
గురువారం అర్థరాత్రి కచ్ ప్రాంతంలో తీరం దాటిన తుపాను.. బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం..
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఈ తుపాను వల్ల ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా.. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కార్వాల్ వెల్లడించారు. గురువారం అర్థరాత్రి కచ్ ప్రాంతంలో తీరం దాటిన తుపాను.. బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. భారీ ఈదురుగాలులకు 800 చెట్లు నేలకూలాయి. అలాగే 500 ఇళ్లు దెబ్బతిన్నాయని, వీటి సంఖ్య మరింత పెరగవచ్చన్నారు. 1000 గ్రామాలకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు. తుపాను తీరం దాటిన కచ్ ప్రాంతంలో తండ్రి, కొడుకు మృతి చెందారని, వివిధ ప్రాంతాల్లో 23 మందికి గాయాలయ్యాయని వివరించారు.
తీరందాటే సమయంలో తుపాను సామర్థ్యం తగ్గడంతో నష్టం కొంతమేర తగ్గిందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అవసరానికి సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను దక్షిణ రాజస్థాన్ మీదుగా పయనిస్తోందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆ ప్రాంతంలో వరదలువచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించామని అతుల్ కార్వాల్ తెలిపారు. ముంబై, కర్ణాటక, రాజస్థాన్ లలోనూ టీమ్ లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజస్థాన్ లోని బర్మేర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Next Story