Mon Dec 23 2024 14:46:59 GMT+0000 (Coordinated Universal Time)
తీరందాటిన బిపోర్ జాయ్.. ఇద్దరు మృతి
తుపాను నేపథ్యంలో దాదాపు 20 తీరప్రాంతాలకు చెందిన లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలకు నదులు..
అతి తీవ్రతుపాను బిపోర్ జాయ్ గుజరాత్ లోని కచ్ జిల్లాలోని కోట్ లఖ్ పత్ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని తాకింది. తీరం దాటిన తుపాను రాజస్థాన్ వైపుగా పయనిస్తోంది. తుపాను తీరందాటిన సమయంలో.. గుజరాత్ తీరంలో భీకరగాలులు బీభత్సం సృష్టించాయి. గుజరాత్ తో పాటు, రాజస్థాన్ లోనూ ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
తుపాను నేపథ్యంలో దాదాపు 20 తీరప్రాంతాలకు చెందిన లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలయమవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షంలో మేకలను రక్షించేందుకు వెళ్లి తండ్రి, కొడుకు మృతి చెందారు. జామ్ నగర్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. పశ్చిమ మధ్య రైల్వే కూడా తుపాను నేపథ్యంలో వివిధ రైళ్లను రద్దు చేసింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సుమారు 20 మంది గాయపడ్డారు. 940 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.అరేబియా సముద్రంలో 10 రోజులకు పైగా కొనసాగిన తుపానుగా బిపోర్ జాయ్ నిలిచిపోనుంది.
మరోవైపు బిపోర్ జాయ్ తుపాను పై పాకిస్థాన్ ప్రభుత్వం తీరప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది.సుమారు 82 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాకిస్థాన్ లో దాదాపు 325 కిలోమీటర్ల తీర ప్రాంతంపై తుపాను ప్రభావం పడుతుందని అక్కడి వాతావరణ విభాగం అంచనా వేసింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు.
Next Story