Sun Dec 22 2024 21:25:41 GMT+0000 (Coordinated Universal Time)
Landslide : వాయనాడ్ లో విధ్వంసం... 93కు చేరిన మృతుల సంఖ్య.. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయ్
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 93కు చేరుకుంది
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 93కు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడటంతో కింద ఉన్న ప్రజలు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి ఈ ఘటన జరిగింది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అనేక మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలు ఎవరివన్నవి కూడా గుర్తించడం కష్టంగా మారింది.
సహాయక చర్యలు ...
ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో వెంటనే సహాయక చర్యలను ప్రారంభించిన సిబ్బంది బాధితులను చురల్మల వద్ద ఉన్న పాఠశాలకు తరలించారు. పాఠశాలలో పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే దురదృష్టవశాత్తూ పునరావాస కేంద్రంపైన కూడా కొండ చరియాలు విరిగిపడటంతో అందులో తలదాచుకుంటున్న వారంతా గల్లంతయ్యారని చెబుతున్నారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాహనాలు పదుల సంఖ్యలో కనిపించకుండా కొట్టుకుపోయాయి.
గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి...
అనేక గ్రామాలకు గ్రామాలు కనిపించడం లేదు. ప్రమాదం జరిగిన సమయంలో అనేక మంది తమ సెల్ఫోన్ల ద్వారా రక్షించాలని కోరుతూ ఆర్తనాదాలు చేయడం కేరళలోని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడలేకపోయారు. సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారింది. వంతెనలు కూడా కూలిపోవడంతో సహాయ చర్యలు చేపట్టడం కష్టమై పోయిందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఎంతమందిని కాపాడారన్నది లెక్క లేదు.
ఇంకా శిధిలాల కిందే....
కొందరు స్థానికులు రక్షించిన వారు మినహా మిగిలిన వారంతా ఇంకా శిధిలాల కిందే ఉన్నట్లు చెబుతున్నారు. కేరళలో ఇంతటి పెను విషాదం గతంలో ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. స్థానికంగా ఒక మసీదులో ఆసుపత్రిని పెట్టి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే సహాయక బృందాలు మాత్రం ఇప్పటి వరకూ 250 మందిని రక్షించినట్లు తెలిపాయి. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద నీరు గ్రామాల్లోకి చేరడంతో ఇబ్బందికరంగా మారింది. వాయనాడ్ జిల్లాలో కొన్ని ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. రెండు రోజులు ప్రభుత్వం సంతాపదినాలుగా ప్రకటించింది.
Next Story