Mon Dec 23 2024 02:33:09 GMT+0000 (Coordinated Universal Time)
శిశువు చనిపోయిందన్న వైద్యులు.. ఖననం చేస్తుండగా
బంకూట్ ప్రాంత నివాసి బషారత్ అహ్మద్ భార్య ఆసుపత్రిలో ప్రసవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు పాప చనిపోయిందని..
జమ్ము : జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బనిహాల్లో వైద్యులు నవజాత శిశువు చనిపోయిందని చెప్పారు. సోమవారం నాడు చనిపోయినట్లు ప్రకటించబడిన నవజాత శిశువును కుటుంబ సభ్యులు ఖననం చేయడానికి తీసుకువెళుతుండగా ప్రాణంతో ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రి వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన శిశువు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. శిశువు కుటుంబ సభ్యుల నిరసనతో ఇద్దరు ఆసుపత్రి ఉద్యోగులను సస్పెండ్ చేశారు అధికారులు.
బంకూట్ ప్రాంత నివాసి బషారత్ అహ్మద్ భార్య ఆసుపత్రిలో ప్రసవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు పాప చనిపోయిందని చెప్పినట్లుగా ఆసుపత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు తెలిపారు. అనంతరం కుటుంబసభ్యులు చిన్నారిని అంత్యక్రియలకు తీసుకెళ్లారు. అయితే పసికందు కదులుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తం అయ్యారు. వెంటనే శిశువును మళ్లీ ఆసుపత్రికి పంపించారు. అక్కడ నుండి ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్లోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.
ఎస్హెచ్ఓ బనిహాల్ మునీర్ ఖాన్ నేతృత్వంలోని పోలీసు బృందం ఆసుపత్రికి చేరుకుని, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శిశువు కుటుంబసభ్యులు ఆందోళనలను విరమించారు. నవజాత శిశువు మరణంపై విచారణ పెండింగ్లో ఉందని అధికారులు తెలిపారు. జూనియర్ స్టాఫ్ నర్సు సుమీనా బేగం, హజారా బేగం అనే స్వీపర్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story