Mon Nov 25 2024 13:33:38 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్, ఢిల్లీలో పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు
2013 మార్చిలో హైదరాబాద్‌కు ఒబేద్ రహమాన్, బీహార్‌కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్..
హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన నలుగురు తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఇండియన్ ముజాహిద్దీన్ తో కలిసి దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఒబేద్ రెహ్మాన్, ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలంకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు రెక్కీ నిర్వహించినట్లు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) వాదనలతో ఎన్ఐఏ కోర్టు ఏకీభవించింది. పేలుళ్లు చేసేందుకు నిందితులు ఆయుధాలు, మందుగుండు పదార్థాలను కూడా సమకూర్చుకున్నట్లు ఎన్ఐఏ కోర్టుకు వివరించింది.
2013 మార్చిలో హైదరాబాద్‌కు ఒబేద్ రహమాన్, బీహార్‌కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్‌లను పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. జులై 7న ఈ నలుగురినీ దోషులుగా నిర్థారించిన ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు నేడు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు డానిష్ అన్సారీకి రూ. 2,000, అఫ్తాబ్ ఆలమ్‌కు రూ. 10,000 జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పేలుళ్లకు కుట్ర పన్నడమే కాకుండా.. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్లు, 2013లో దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. గతంలో వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్ లో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల పాత్ర ఉందని ఎన్ఐఏ వివరించింది. ఈ కేసుల్లో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్ తో పాటు మరో నిందితుడు ఉన్నారు. జైలులో ఉన్న ఐదుగురు నిందితులపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని ఎన్ఐఏ తెలిపింది.
Next Story