పరిస్థితి క్రిటికల్.. స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం?
దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి గాలి పీల్చుకోవాలంటేనే తెగ భయాందోళనకు గురవుతున్నారు..
దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి గాలి పీల్చుకోవాలంటేనే తెగ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అక్కడి గాలి పీల్చిన ఎంతో మంది జనాలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇది ఎక్కడ కాదు.. ఢిల్లీ నగరంలో.ఢిల్లీ వాయు నాణ్యత సూచీ నిన్న 309కి చేరుకుంది. భారీగానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) నమోదు కావడంతో నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఢిల్లీలో గాలి నాణ్యత శుక్రవారం మరోసారి చాలా పేలవమైన కేటగిరీకి పడిపోయింది. AQI 249తో నమోదైంది. సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ 200 నుండి 300 మధ్య ఉంటుంది. రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతోంది. దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ పండుగ తరువాత ఎలా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబరు 21న ఢిల్లీ ఏక్యూఐ 173 గా ఉంటే, 22 ఆదివారం ఉదయం 266గా ఉంది.
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోంది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేసింది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కింగ్ ఫీజులు పెంచాలని, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగితే, నూతన ఆంక్షలు విధించే అవకాశముందని సమాచారం. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్-III, బీఎస్-IV వాహనాలను నిషేధించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం నిరంతరం దిగజారుతోంది. వాయుకాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దనివాతావరణ శాఖ సూచించింది. గురువారం, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సిగ్నల్ వద్ద వారి వాహనాలను ఆపడానికి డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి ప్రచారం ప్రారంభించారు. వీలైనంత వరకు జనాలు బయటకు రావద్దని సూచిస్తున్నారు అధికారులు. శ్వాసకోశ రోగులు బహిరంగ ప్రదేశంలో ముసుగులు ధరించమని సలహా ఇస్తున్నారు. అదే సమయంలో ముంబైలో కూడా వాయుకాలుష్యం పెరిగింది.