Mon Dec 23 2024 04:49:32 GMT+0000 (Coordinated Universal Time)
helicopters : ఒక్కసారిగా ఇంత పెంచేశారే.. ఎన్నికల్లో తిరగాలంటే ఖర్చు చేయాల్సిందే
దేశంలో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్నికల ప్రచారం కోసం నేతలు వినియోగిస్తుండటంతో సంస్థలు ఒక్కసారిగా ధరలు పెంచేశాయి
లోక్సభ ఎన్నికలతో పాలు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ, పదేళ్ల తర్వాత గెలిచి పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఎన్డీఏ, ఇండియా కూటములు ఎన్నికలకు రెడీ అయిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీలు కూడా....
అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత పర్యటనల వ్యయం అభ్యర్థుల ఖాతాల్లో పడే అవకాశముండటంతో ముందుగానే నియోజకవర్గాల్లో పర్యటలను ప్రారంభించారు. దేశంలో జాతీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికే అధికారంలో ఉన్నవాళ్లతో పాటు ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అత్యంత వేగంగా రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా...
ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని మరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకూ తమ వద్దనే హెలికాప్టర్ ఉండేలా నేతలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి అన్ని పార్టీల నేతలు నాలుగైదు హెలికాప్టర్లను ముందుగానే బుక్ చేసుకుని తమ ప్రచారానికి అంతా రూట్ మ్యాప్ ను రెడీ చేసుకుంటున్నారు. దీంతో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. సులువుగా, వేగంగా నియోజకవర్గాలకు చేరుకునే అవకాశముండటంతో ఎక్కువ మంది రోడ్డు మార్గం ద్వారా కాకుండా గాలిలోనే ప్రయాణించేందుకు ప్లాన్ చేసుకుంటుండటంతో వాటి డిమాండ్ పెరిగింది.
గంట లెక్కన...
దీంతో గంట లెక్కన హెలికాప్టర్ సంస్థలు పార్టీల నుంచి వసూలు చేస్తున్నాయి. ఒక్క గంటకు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుంటే లక్ష నుంచి లక్షన్నర రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గత ఎన్నికలకంటే దాదాపు యాభై శాతం అదనంగా వసూలు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సేఫ్ జర్నీ కోరుకోవడంతో నేతలు ఎక్కువగా ప్రముఖ కంపెనీలనే ఆశ్రయిస్తుండటంతో వాటి ధరలు అమాంతంగా పెంచేశారు. అయినా తప్పని పరిస్థితుల్లో చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. పార్టీ అగ్రనేతలు ఎక్కువగా ప్రచారానికి హెలికాప్టర్ల వినియోగం ఎక్కువ కావడంతో వీటి డిమాండ్ పెరిగింది. అయినా ధరలను చూసి ఏ మాత్రం వెనకాడటం లేదు.
జగన్, పవన్, బాబు కూడా...
ఎంత చెల్లించి అయినా హెలికాప్టర్ ను నెలరోజుల పాటు తమ వద్ద ఉంచుకునేలా కొన్ని పార్టీలు ముందుగానే బుక్ చేసుకున్నాయి. పార్టీలు తమ గుర్తులను కూడా హెలికాప్టర్ల పై ముద్రించి మరీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే ఏకంగా మూడు ప్రాంతాల్లో మూడు హెలికాప్టర్లను ముందుగానే బుక్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హెలికాప్టర్ ను బాడుగకు తీసుకుని రా కదలిరా సభలకు వెళ్లి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం తన ప్రచారం నిమిత్తం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ ను బుక్ చేసుకున్నారు. ప్రచారాన్ని ముగించుకుని సాయంత్రానికి తిరిగి తమ ఇంటికి చేరుకునే వీలుండటంతోనే హెలికాప్టర్లకు ఈ ఎన్నికల సమయంలో భారీ డిమాండ్ పెరిగింది.
Next Story