Fri Nov 22 2024 21:20:20 GMT+0000 (Coordinated Universal Time)
వందేభారత్ కు వీటిని అమర్చాల్సిందేనా?
వందే భారత్ రైళ్లకు తరచూ జరుగుతున్న ప్రమాదాల గురించి రైల్వే శాఖ నిపుణులతో చర్చిస్తుంటే కోస్ట్ గార్డుల గురించి చర్చించారు
వందే భారత్ రైళ్లకు తరచూ జరుగుతున్న ప్రమాదాల గురించి రైల్వే శాఖ నిపుణులతో చర్చిస్తుంటే వీటి గురించి చెప్పారు. డీజిల్ లోకో (రైలింజన్) ఎలక్ట్రికల్ లోకో, డీఈఎంయూ, ఎంఈఎంయూ, వాటి తాతలైన బొగ్గు ఇంజన్లు. ఇలా ఏ లోకో అయినా, అవి పుట్టినప్పటి నుంచి ఇంజిన్ అనే దానికి ఇవి తప్పనిసరి. మన దేశంలో రైళ్లు పుట్టినప్పటి నుంచి, రైల్వే లైన్లు ఏర్పడినప్పటి నుంచి లోకో మోటివ్ తయారీలో ఇవి భాగం. చాలా దృఢంగా ఉంటాయి. రైల్వే గార్డు, కౌ క్యాచర్, క్యాటిల్ గార్డ్, , లైఫ్ గార్డ్ అనే "పైలట్" ఏర్పాటు ఇంజిన్ లో భాగంగా ఉంటుంది. గాలిని చీల్చుకుని వెళ్లేలా కొనతేలిన "V" ఆకారంలో ఇంజిన్ కు రెండు వైపులా విస్తరించి ఉంటుంది.
19వ శతాబ్దంలోనే...
రైల్వే ట్రాక్ ల మీద ఎలాంటి రక్షణ ఉండదు కాబట్టి పట్టాల మీద వేగంగా వెళ్ళే రైలుకు ఏమి అడ్డం పడకుండా ఈ ఏర్పాటు 19వ శతాబ్దం తొలినాళ్ళలో మొదలైంది. ట్రాక్ మీదకు పశువులు, అడవుల్లో వన్య మృగాలు, కొండ ప్రాంతాల్లో రాళ్ళు పడితే వాటిని ఈ గార్డులు అడ్డుకుంటాయి. పట్టాల మీద ఉండే ఎలాంటి అడ్డంకులు అయినా వీటిని దాటుకుని మాత్రమే మిగిలిన రైలును చేరాల్సి ఉంటుంది. ఇంజిన్ రక్షణ వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కనీసం తుప్పు కూడా పట్టనివ్వరు. రైలు పట్టా మీద రెండు మూడు అంగుళాల ఎత్తులో ఉండేలా ఇంజిన్ కు అమరుస్తారు. ప్రత్యేకమైన ట్రాక్ కారిడార్లు ఉండే బులెట్ రైళ్లకు, మెట్రోలకు వీటి అవసరం ఉండదు.
బ్రాడ్ గేజ్ ట్రాక్ మీద...
బ్రాడ్ గేజ్ ట్రాక్ మీద వెళ్ళే ప్రతి రైలుకు వీటి అవసరం ఉంటుంది. ట్రాక్ మీదకు జనం, పశువులు రాకుండా కంచె వేయడం సాధ్యం కాబట్టి ఈ గార్డులు అవసరం. అడవుల్లో చెట్లు, రాళ్ళు పడితే వాటిని రైలు డీ కొడితే రైళ్ల కు ఘోర ప్రమాదాలు జరుగుతాయి. వేగంగా ప్రయాణించే రైళ్ళను వెంటనే ఆపలేరు కాబట్టి వీటిని బలమైన ఇనుముతో తయారు చేస్తారు. ఏనుగు వంటి జంతువైనా ఎగిరి అవతల పడాల్సిందే. మన హై స్పీడ్ రైళ్లలో ఈ ఏర్పాటు లేదు.... అందుకే పాపం వాటికి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందు భాగంలో కౌ క్యాచర్ లేకపోయే సరికి అలా జరుగుతోంది అన్నమాట.... ఫైబర్ రైళ్లు మనల్ని ఏమి చేస్తాయి అని ఆవులు అమాయకంగా పట్టాల మీదకు వస్తున్నాయి.
Next Story