Mon Dec 23 2024 13:38:52 GMT+0000 (Coordinated Universal Time)
అర్థరాత్రి ఆస్పత్రికి వచ్చిన రోగిని చితకబాదిన వైద్యుడు (Viral Video)
ఛత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మత్తులో ఉన్న ఒక వైద్యుడు మహిళా రోగిని విచక్షణా రహితంగా..
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ పనితీరుకు ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వైద్యుడు రోగిన చితకబాదుతున్నాడు. ఛత్తీస్ గఢ్ లో జరిగిందీ ఘటన. కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి వీడియో బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మత్తులో ఉన్న ఒక వైద్యుడు మహిళా రోగిని విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్‌పై షోకాజ్ నోటీసు జారీ చేసింది. రోగి కుమారుడు శ్యామ్ కుమార్ తన తల్లి సుఖమతి ఆరోగ్యం అర్థరాత్రి క్షీణించటంతో ఆస్పత్రికి తీసుకొచ్చాడు. 108,112 కు ఫోన్ చేసినా ఫలితం లేకపోవటంతో..అతడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన తల్లిని ఆటో రిక్షాలో ఆస్పత్రికి తీసుకొచ్చాడు.
అత్యవసరంగా ఆస్పత్రికి వచ్చిన రోగికి వైద్యుడు చికిత్స చేయకపోగా.. ఆమెను చితకబాదాడు. అదంతా వీడియో తీసిన శ్యామ్ కుమార్.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో వైద్యుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు సదరు డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వైద్యుడి పై షోకాజ్ నోటీసు జారీ చేశామని మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు. విచారణ చేసి.. అతనిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story