Thu Nov 07 2024 15:36:14 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru Water Crisis : అకాల వర్షాలు.. బెంగళూరు నగరానికి మాత్రం వరమేగా?
బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య తీరినట్లే. వర్షాలు కురుస్తుండటంతో నీటి ఎద్దడి నుంచి బెంగళూరు నగరం బయటపడింది
బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య తీరినట్లే. వర్షాలు కురుస్తుండటంతో నీటి ఎద్దడి నుంచి బెంగళూరు నగరం బయటపడింది. ఎగువన వర్షాలు పడటంతో కావేరి నదిలో నీరు వచ్చి చేరుతుండటంతో చాలా వరకూ నీటి ఎద్దడి ప్రమాదం తప్పి పోయినట్లే. దీంతో పాలకుల నుంచి నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలు పెరగడంతో బోరు నీరు కూడా పుష్కలంగా వస్తుండటంతో సాధారణ స్థితికి బెంగళూరు నగరం చేరుకున్నట్లే కనిపిస్తుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా...
బెంగళూరు నగరం గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడిని ఎదుర్కొంది. చివరకు తాగడానికి, స్నానాలకు కూడా నీళ్లు దొరకక అనేక మంది ఇబ్బందులు పడ్డారు. నీటి ట్యాంకర్ల వద్ద యుద్ధాలే జరిగాయి. మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని నీటి ఎద్దటి బెంగళూరు నగరంలో నెలకొంది. డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనుకున్నా అపార్ట్మెంట్ వాసులకు ట్యాంకర్లు దొరక లేదు. నీటిని వృధా చేసినట్లు తెలిస్తే జరిమానా విధించారంటే ఏ స్థాయిలో నీటి ఎద్దడి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.
డబ్బుపెట్టి కొనాలన్నా...
కనీసం డబ్బు పెట్టి కొనుగోలు చేయాలన్నా నీరు దొరకని పరిస్థితి నెలకొంది. అసలు బెంగళూరులో ఇంతటి నీటి ఎద్దడి గతంలో ఎన్నడూ చూడలేదని అనేకమంది సొంతూళ్లుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నగరాన్ని ఖాళీ చేసి మరీ నీటి కోసం అవస్థలు పడలేక వెళ్లిపోయారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంపెనీలు, విద్యాసంస్థలు కూడా సెలవులు ఇచ్చాయంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మూడు నెలల పాటు ఈ నీటి ఎద్దడి తప్పదని అందరూ భావించారు.
వరుణుడు కరుణించడంతో...
కానీ వరుణుడు కరుణించాడు. అకాల వర్షాలతో బెంగళూరు నగరం నీటి ఎద్దడి ముప్పు నుంచి తప్పించుకున్నటే. ఇక రుతుపవనాల రాక కూడా ప్రవేశించడంతో ఇక వర్షాకాలం కూడా త్వరగా వస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో బెంగళూరు నగరం బయటపడినట్లే అయింది. అకాల వర్షాలు కురవకపోతే బెంగళూరు నగరం పరిస్థితి దారుణంగా తయారయ్యేదని అందరూ భావించారు. ఆ ఊహకే వణికిపోతున్నారు. మొత్తం మీదవర్షాలు కురుస్తుండటంతో బెంగళూరు నగరంలో ఇక నీటి ఎద్దడి నుంచి బయటపడినట్లే కానీ... భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాలకులు ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story