Fri Nov 22 2024 10:30:54 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ, యూపీల్లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
నేపాల్ దేశంలోనూ భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.2గా నమోదైంది. కొన్ని సెకన్ల పాటు భూమి
దేశ రాజధాని ఢిల్లీ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. బుధవారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. వస్తువులు, వాహనాలు ఊగటంతో భయకంపితులయ్యారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసరాల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది.
మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ స్వల్పంగా భూప్రకంపనలు కనిపించాయి. నేపాల్ దేశంలోనూ భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.2గా నమోదైంది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. భారత్ లోనూ త్వరలోనే టర్కీ తరహా భూకంపం రావొచ్చని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ లో రానున్న రోజుల్లో టర్కీ తరహాలా భూకంపాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సీస్మాలజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు.
వాటి గురించి తెలుసుకునేందుకు హిమాలయ ప్రాంతాల్లో 80 సిస్మిక్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అతితీవ్రమైన భూకంపాలు ఎప్పుడు వస్తాయన్న ఖచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారు. హెచ్చరికలు చేసిన కొద్దిసమయానికి ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లలో భూప్రకంపనలు రావడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.
Next Story