Tue Nov 05 2024 16:42:36 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గ్-పూరీ ఎక్స్ ప్రెస్ లో మంటలు
తాజాగా మరో ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. దుర్గ్-పూరీ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీ కింది భాగంలో మంటలు చెలరేగాయి.
ఒడిశాలో కోరమాండల్ రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కలవరపెట్టింది. ఊహించని ఈ ఘోర రైలు ప్రమాదం కారణంగా.. అధికారిక లెక్కలప్రకారం 275 మంది ప్రయాణికులు మరణించగా.. వేయి మందికిపైగా ప్రయాణికులు తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ దుర్ఘటన మరువక ముందే.. ఒడిశాలోనే వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటన తర్వాత సున్నపురాయి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నాలుగు బోగీలు ఒరిగిపోయాయి. ఆ తర్వాత.. జూన్ 7న జాజ్ పూర్ రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు బోగీల కింద పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఇంజన్ లేని గూడ్స్ రైలు.. భారీ ఈదురుగాలులకు ముందుకు కదలడంతో.. వర్షానికి బోగీల కింద తలదాచుకున్న కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా మరో ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. దుర్గ్-పూరీ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీ కింది భాగంలో మంటలు చెలరేగాయి. నౌపడ జిల్లాలోని ఖరియార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 18426 నంబర్ రైలు గురువారం సాయంత్రం ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ నుంచి ఒడిశాలోని పూరీకి బయలుదేరింది. రాత్రి 10.07 గంటల సమయంలో ఖరియార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏసీ బోగీలోంచి పొగలు వచ్చి.. చక్రాల కింద మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే చైన్ లాగి రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. బీ3 కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. చక్రాల వద్ద ఉన్న బ్రేక్స్ జామ్ కావడం వల్ల రాపిడికి గురై మంటలు వచ్చాయని అధికారులు నిర్ధారించారు. మంటలను ఆర్పివేశాక బ్రేక్స్ ను సరిచేయడంతో దుర్గ్-పూరీ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 11 గంటల సమయంలో పూరీకి బయలుదేరింది.
Next Story