Mon Dec 23 2024 13:40:41 GMT+0000 (Coordinated Universal Time)
“హ్యాండ్” రైజింగ్ కోసం
త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం
త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం. రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్నా, భవిష్యత్ లో పెద్దల సభలో పట్టు నిలుపుకోవాలనుకున్నా ఐదింటిలో గెలిచి తారాల్సిన పరిస్థితి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణలో ఈఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో రెండింటిలో మాత్రమే అధికారంలో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ను కమలం పార్టీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలవడంతో మధ్యప్రదేశ్ చేజారిపోయింది.
ఏ రాష్ట్రానికి ఆ వ్యూహం…
తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ రెండోసారి కూడా కాంగ్రెస్ అక్కడ విజయం సాధించలేకపోయింది. ఛత్తీస్ ఘడ్ లో పదిహేనేళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి అధికారంలోకి రాగలిగింది. అక్కడ అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న భూపేశ్ బఘేల్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. స్ట్రీట్ ఫైటర్ అని పేరొందిన భూపేశ్ బఘేల్ పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయగలిగారు. మంచి నేతగా పేరొందిన రమణ్ సింగ్ ను ఆయన ధీటుగా ఎదుర్కొన్నారు. అందుకే గెలిచిన తర్వాత భూపేశ్ బఘేల్ ను ముఖ్యమంత్రిగా చేశారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం కావడంతో అక్కడ బీజేపీ హవాను తట్టుకుని పార్టీని నిలబెట్టేలా చేశారు.
అదే తరహాలో…
రాజస్థాన్ లో ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలిచిన సీన్ లేదు. ప్రజలు అపోజిషన్ పార్టీనే అందలం ఎక్కించడం ఆనవాయితీగా వస్తుంది. మధ్యప్రదేశ్ లో సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈసారి అన్ని రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫార్ములాను ప్రయోగించాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయింది. కర్ణాటకలో నేతల ఐక్యతను కొనసాగించడంతో పాటు ఉచితాలను, గ్యారంటీ స్కీమ్ లను కూడా ఈ ఐదు రాష్ట్రాల్లో తేనుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాల వారీగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించి రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా మ్యానిఫేస్టోను సిద్ధం చేయాలని పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఇవన్నీపాటిస్తే…
కర్ణాటకలో వన్ సైడ్ గెలిచిన తరహాలోనే ఈ ఐదు రాష్ట్రాల్లోనూ గెలుపు ఉండాలన్నది టెన్ జన్ పథ్ ఆలోచన. అందుకు అనుగుణంగా సర్వే నివేదికలతో అభ్యర్థులను ఎంపిక చేయడం, హామీల విషయంలో గ్యారంటీకార్డును విడుదల చేయడం, నేతలందరినీ కలుపుకుని వెళ్లేలా నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటివి చేయాలన్న వ్యూహరచన చేస్తుంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందుగానే కొన్ని పథకాలను అమలుచేయడం, లేనిచోట ఉచితాల హామీలతో జనంలోకి వెళ్లడంపై ఎక్కువ ఫోకస్ పెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆ యా రాష్ట్రాలకు ఇన్ ఛార్జులున్నప్పటికీ ఎన్నికల కోెసం ప్రత్యేకంగా కొందరిని నియమించి వారి ద్వారా ఎలక్షనీరింగ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది. దీంతో పాటు రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్ర కూడా ఈ రాష్ట్రాల్లో నుంచి వెళ్లేలా ప్లాన్ చేసి క్యాడర్ లో కొంత ఊపు తేవాలన్న లక్ష్యంతో ఉంది. మరి అన్ని చోట్ల కన్నడ ఫార్ములా పనిచేస్తుందా?లేదా?అన్నది చూడాల్సి ఉంది.
Next Story