Fri Dec 20 2024 22:06:41 GMT+0000 (Coordinated Universal Time)
Bharat Ratna 2024 : జన నాయకుడికి భారత రత్న
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది
Bharat Ratna 2024 Karpoori Thakur:బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును రాష్ట్రపతి భవన్ ఆయన శత జయంతి సందర్భంగా ప్రకటించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా, జననాయక్ ఆయనకు పేరు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఆరోజు దాదాపు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కర్పూరీ ఠాకూర్ 1952లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
ఉపాధ్యాయ వృత్తి నుంచి...
బీహార్ లోని సమస్తిపూర్‌లో జన్మించిన కర్పూరీ ఠాకూర్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడిగా సేవలందించారు. రాజకీయ నేతగా మారి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. నాయీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన పాట్నా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పొందారు. జాతీయోద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. తొలుత తాజ్‌పురి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1924 జనవరి 24 ఆయన జన్మించారు.
ఎందరికో రాజకీయ గురువు...
1970లో కర్పూరీ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు ఆయన బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. కాంగ్రెస్, జనతా పార్టీ తరుపున ఆయన రాజకీయాల్లో పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, దివంగత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ లకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పారు. ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న పురస్కారం లభించడం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.
Next Story