Thu Dec 19 2024 12:13:16 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కాంగ్రెస్కు అభ్యర్థులు కరువయ్యారా? అధికార పార్టీకి ఈ అవస్థేంటి సామీ?
లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను ఇతర పార్టీల నుంచి తెచ్చుకోవడం కాంగ్రెస్ కు తలవంపులుగా మారింది
కాంగ్రెస్ జాతీయ పార్టీ. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నేతలకు కొదవలేదు. ఎక్కడ బట్టినా మాజీ నేతలే.. మాజీ కేంద్ర మంత్రులే.. దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండటంతో అన్ని రాష్ట్రాల నుంచి మంత్రి పదవి చేసి రాజకీయంగా పేరున్న వారు అనేక మంది ఉన్నారు. ఇక మన తెలంగాణకు వస్తే.. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత కూడా పదేళ్ల పాటు ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించలేదు. కానీ ఎట్టకేలకు మొన్నటి ఎన్నికల్లో జనం జై కొట్టారు కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్దం తర్వాత కాంగ్రెస్ కల నెరవేరింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.
అనేక మంది నేతలున్నా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2014 వరకూ అధికారంలో ఉండటంతో అనేక మంది అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పదవులను పొందారు. మంత్రి పదవులే కాదు నామినేటెడ్ పదవులను కూడా దక్కించుకుని కాస్తో కూస్తో వెనకేసుకున్నారు. ఆర్థికంగా బలవంతులైన నేతలు అనేక మంది ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. నగర వాసులు గులాబీ పార్టీనే నమ్మారు. కాంగ్రెస్ ను విశ్వసించలేదు. నగరమంతా హస్తం పార్టీ వైపు చూడలేదు. అందుకే మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి ఒక్కరికి కూడా స్థానం కల్పించలేకపోయారు. అయితే జిల్లాల్లో మాత్రం జనం ఆదరించారు.
ఆ పార్టీ నుంచి తీసుకుని...
ఇప్పుడు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి. అందులోనూ అధికారంలో ఉంది. ఇటు అధికారంతో పాటు అన్ని రకాలుగా అర్హులైన నేతలు అనేక మంది ఉన్నారు. కానీ మిగిలిన పార్టీల నేతల కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతుండటమే అనేక సందేహాలకు కారణమవుతుంది. ఈ ఖర్మేమిటి భయ్యా? అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లారు. బీఆర్ఎస్ లో పదేళ్ల పాటు సేద తీరారు. ఇప్పుడు ఆయన మరొకసారి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఓకే.. ఆయనిష్టం.. కాదనలేం.
అభ్యర్థులే లేరా?
కానీ ఇప్పుడు క్యాడర్ అడుగుతున్న ప్రశ్నేమిటంటే.. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దించుతుందన్న ప్రచారం రావడమే కార్యకర్తలు సహించలేకపోతున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకుని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాల్సిన గతి ఎందుకున్న ప్రశ్న క్యాడర్ నుంచి వినపడుతుంది. ఆయన కాకుంటే మరెవరూ లేరా? అని నిలదీస్తున్నారు. అలాగే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని తీసుకుని మరీ ఆయనను తిరిగి అక్కడి నుంచి పోటీ చేయిస్తారట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఖర్మ ఏంట్రాబాబూ అంటూ క్యాడర్ తలలు పట్టుకుంటోంది. ఆర్థికంగా బలంగా ఉండటం, రానున్న ఎన్నికల్లో ఖర్చు భరిస్తారన్న ఏకైక అర్హతతోనే వాళ్లను తీసుకున్నట్లు కనపడుతుంది. అంతకు మించి వేరే ఏముంటుంది? అని సెటైర్లు వినపడుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను ఇతర పార్టీల నుంచి తెచ్చుకోవడం కాంగ్రెస్ కు తలవంపులుగా మారింది
Next Story