Fri Dec 27 2024 03:02:30 GMT+0000 (Coordinated Universal Time)
రైళ్లు ఆలస్యంగా వస్తాయి కానీ.. మరీ ఇంత ఆలస్యంగానా !?
సాంకేతిక కారణాలతో రైలు నిర్ణీత సమయానికి గమ్యానికి చేరుకోలేకపోయింది. ఆ తర్వాత రైలు గురించి అధికారులు..
ఝార్ఖండ్ : మనదేశంలో రైళ్లు సమయానికి స్టేషన్ కు లేదా.. గమ్యస్థానానికి చేరుకోవడం అసంభవం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రైళ్లు ఆలస్యంగా వస్తాయి కానీ.. మరీ ఇంత ఆలస్యంగా వస్తాయని ఎవరూ ఊహించరు. 762 కిలోమీటర్లు ప్రయాణించి, గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆ రైలుకు ఏకంగా ఏడాది సమయం పట్టింది. ఏంటి ఇది నిజమా ? కాదా అని అనుమానిస్తున్నారా ? నిజమే. అసలు విషయం ఏమిటంటే.. గతేడాది మే నెలలో ఛత్తీస్ గఢ్ లోని ఒక రైల్వే స్టేషన్ నుంచి గూడ్సు రైలు వెయ్యి బియ్యం బస్తాలతో ఝార్ఖండ్ లోని న్యూ గిరిడీ స్టేషన్ కు బయల్దేరింది.
సాంకేతిక కారణాలతో రైలు నిర్ణీత సమయానికి గమ్యానికి చేరుకోలేకపోయింది. ఆ తర్వాత రైలు గురించి అధికారులు మరిచిపోయారు. ఏడాదిపాటు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. పట్టాలపైనే ఉండిపోయింది. ఎట్టకేలకు ఈనెల 17న న్యూ గిరిడీ స్టేషన్ కు చేరుకుంది. ఆ గూడ్సు రైలులో వచ్చిన సరుకును అన్ లోడ్ చేయాలని స్టేషన్ సిబ్బందికి సమాచారం అందింది. షెడ్యూల్ తో ఏమాత్రం సంబంధం లేకుండా స్టేషన్ కు వచ్చిన రైలును చూసి అధికారులు షాకయ్యారు. ఆ గూడ్సురైలులో ఉన్న బియ్యం పూర్తిగా పాడైపోయాయి. మొత్తం 1000 బస్తాల్లో 300 బస్తాల బియ్యం పాడైపోయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 700 బస్తాల బియ్యం కూడా పనికొస్తాయో లేదో చెప్పలేమని న్యూ గిరిడీ స్టేషన్ మాస్టర్ పంకజ్ కుమార్ తెలిపారు.
Next Story