Tue Nov 05 2024 12:37:07 GMT+0000 (Coordinated Universal Time)
Farmers Agitation : రైతు సంఘాలతో చర్చలు విఫలం..మరోసారి చలో ఢిల్లీ
రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు అంగీకరించలేదు.
రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 21వ తేదీన మరోసారి చలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపు నిచ్చాయి. తాము శాంతియుతంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని రైతు సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధన కోసం రైతులు శంభూ వద్ద గత ఆరు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సరిహద్దుల్లోనే బైఠాయించి....
రైతు సంఘాల నేతలతో నాలుగు విడతలుగా కేంద్ర ప్రభుత్వం తరుపున మంత్రులు చర్చలు జరిపారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆందోళన విరమించుకోవాలని, ప్రభుత్వం డిమాండ్లను పరిశీలిస్తుందని చెప్పినా రైతులు శంభూ సరిహద్దుల వద్దనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ కు చెందిన రైతులు వేల సంఖ్యలో వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు కూడా అప్రమత్తమై ఢిల్లీలోకి రాకుండా అనేక చర్యలు చేపట్టారు.
ఇంటర్నెట్ సేవలు బంద్...
రైతులతో చర్చలు విఫలమయిన నేపథ్యంలో హర్యానాలో ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని ఈ నెల 20వ తేదీ వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్నెట్తో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిస్సార్, ఫతేహఆబాద్, శిర్సా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలతో పాటు మొబైల్ ఎస్ఎంఎస్ లపై కూడా నిషేధం విధించింది. శంభూ బోర్డర్ వద్ద ఉన్న రైతులు ఢిల్లీలోకి రాకుండా పెద్దయెత్తున భద్రతాదళాలు మొహరించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
Next Story