Mon Dec 23 2024 13:18:31 GMT+0000 (Coordinated Universal Time)
కట్నం కింద ట్రాక్టర్ డిమాండ్.. మందీ మార్బలంతో వెళ్లిన వరుడికి దిమ్మతిరిగే షాక్
వరుడికి కట్నంగా ఏమేమి ఇవ్వాలో అన్ని ఒప్పందాలు కుదిరాయి. ముహూర్తాలూ పెట్టుకున్నారు. మార్చి 14న వివాహం..
ఈ రోజుల్లో కొన్ని పెళ్లిళ్లు పీటల వరకూ వచ్చి ఆగిపోతున్నాయి. కట్నం చాల్లేదని, వరుడు మద్యం సేవించడం, వధువు నచ్చక, వరుడు నచ్చక, మర్యాదలు సరిగ్గా చేయలేదని ఇలా రకరకాల కారణాలతో పెళ్లిళ్లు రద్దవుతున్నాయి. అలా తాజాగా మరో ప్రాంతంలో పెళ్లి రద్దైంది. కట్నంగా నగలు, నగదు, ఇంట్లోని వస్తువులు, ఫ్రిడ్జ్ తో సహా ఏ లోటు లేకుండా ఫర్నీచర్లు అన్నీ ఇచ్చినా ఆ వరుడికి సరిపోలేదు. ట్రాక్టర్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండికేశాడు. అలా అయితే నాకీ పెళ్లే అక్కర్లేదంది వధువు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని కుల్హారీ గ్రామంలో జరిగిందీ ఘటన.
కుల్హారీ గ్రామానికి చెందిన యువతికి షామ్లీలోని భైంసాని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. వరుడికి కట్నంగా ఏమేమి ఇవ్వాలో అన్ని ఒప్పందాలు కుదిరాయి. ముహూర్తాలూ పెట్టుకున్నారు. మార్చి 14న వివాహం జరగాల్సింది. నగలు,నగదు, సామాన్లు, ఫర్నీచర్లు అన్నీ ఇచ్చినా సరిపోలేదట. ట్రాక్టర్ ఇస్తేనే తాళి కడతానని పెళ్లికి ఒకరోజు ముందు డిమాండ్ చేశాడు. తెల్లవారితే పెళ్లి అనగా ఇప్పుడీ డిమాండ్స్ ఏంటని అడిగారు వధువు తరపు బంధువులు. ట్రాక్టర్ ఇస్తేనే పెళ్లికి వస్తామని లేకుంటే లేదని తెగేసి చెప్పాడు వరుడు. దాంతో కడుపుమంటతో రగిలిపోయిన ఆడపెళ్లివారు.. సరే ఇస్తాం రండి అని కబురుపెట్టారు. ఇంకేముంది.. మంది మార్బలంతో వచ్చారు మగపెళ్లివారు.
వచ్చీరావడంతోనే అతని కుటుంబసభ్యుల్ని తాళ్లతో కట్టేశారు. దాంతో దిమ్మతిరిగినంత పనైంది. కొత్త ట్రాక్టర్ తీసుకొచ్చి..పెళ్లికూతురుకు బదులుగా ట్రాక్టర్తోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. ఇంతలో సీన్ లోకి వధువు వచ్చింది. నీకు ఎంత కట్నం ఇచ్చినా చాల్లేదు. ఇప్పుడు ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేశావ్. ఇదిగో ఈ ట్రాక్టర్ కే తాళి కట్టుకో..దాంతోనే కాపురం చేసుకో నువ్వు వద్దూ..నీతో పెళ్లి వద్దు పొమ్మంది. అత్యాశకు పోయి, పరువు పోయి, అడిగింది లేక.. తమను వదిలేయాలని కోరారు వరుడి బంధువులు. అందుకో కండీషన్ పెట్టారు వధువు బంధువులు.
మీకు ఇప్పటివరకు ఇచ్చిన నగదుతో పాటు పెళ్లి కోసం చేసిన ఖర్చులు కూడా ఇస్తేనే వదులుతామని డిమాండ్ చేశారు. వేరే దారిలేక అలాగే ఇస్తామని అంగీకరించారు వరుడు..అతని కుటుంబ సభ్యులు. దాంతో వారందరిని వదిలారు ఆడపెళ్లివారు. దీంతో బతుకు జీవుడా అంటూ తెల్లముఖాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన వారంతా.. వరకట్న దాహంతో ఉన్న వరుడు, అతని బంధువులకు తగిన శాస్తే జరిగింది అనుకుంటున్నారు.
Next Story