Wed Dec 25 2024 20:50:23 GMT+0000 (Coordinated Universal Time)
అబ్బాయిలకు షాకిస్తూ.. తనను తానే పెళ్లి చేసుకుంటున్న యువతి
స్వీయ వివాహం అంటే నీ పట్ల నువ్వు అంకిత భావం కలిగి ఉండడం. ఎటువంటి షరతుల్లేని ప్రేమకు నిదర్శనం.
ఇప్పుడే పెళ్లి చేసుకోడానికి అమ్మాయిలు లేక ఎంతో మంది అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతూ ఉన్నారు. తాజాగా గుజరాత్ లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు అనే అమ్మాయి తనను తానే పెళ్లాడుతోంది. విచిత్రంగా అనిపించినా ఇది ముమ్మాటికి నిజం. జూన్ 11న ముహూర్తం కూడా పెట్టేసుకుంది.
ఎవరీ క్షమాబిందు:
వడోదర నివాసి క్షమాబిందు జూన్ 11న తనను తానే వివాహం చేసుకోనుంది. క్షమా సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లు. ఆమె తండ్రి దక్షిణాఫ్రికాలో, తల్లి అహ్మదాబాద్లో ఉంటున్నారు. చాలా మంది అమ్మాయిలు ఘనంగా తమను పెళ్లి చేసుకుని.. మెట్టినింటికి తీసుకెళ్లే వరుడి గురించి కలలు కంటుండగా, క్షమా తన వరుడిని తనలోనే చూసుకుంది. ఆమెకి తనంటే చాలా ఇష్టం, ఆమెకు మరెవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె సంప్రదాయబద్దంగానే చేసుకోవాలని నిర్ణయించుకుంది. గుజరాత్ లో ఇదే తొలి స్వీయ వివాహం (సోలోగమీ) కానుంది. ''నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. అందుకే స్వీయ వివాహం. నేను దీనికి సంబంధించి ఆన్ లైన్ లో కూడా శోధించాను. దేశంలో ఏ మహిళ అయినా తనను తానే పెళ్లి చేసుకుందా? అని పరిశీలించాను. కానీ, ఎవరూ లేరని తెలిసింది. కనుక దేశంలో తనను తాను ప్రేమించి పెళ్లి చేసుకునే మొదటి వ్యక్తిని నేను '' అని క్షమాబిందు తెలిపింది.
క్షమ పెళ్లికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆమె పెళ్లి కోసం లెహెంగాను కూడా ఆర్డర్ చేసింది. పెళ్లి కార్డులను కూడా పంపిణీ చేసింది. అయితే వెడ్డింగ్ కార్డ్లో వరుడి పేరు లేదు, వధువు పేరు మాత్రమే ఉంది. తల్లిదండ్రులు ఆమెను అర్థం చేసుకోవడానికి టైమ్ తీసుకున్నా, ఆఖరికి వారిద్దరూ ఆమె ఇష్టానికి ఒప్పుకున్నారు. క్షమా తన స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకోబోతోంది, ఆమె తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా ఈ ఫంక్షన్స్ కు హాజరవుతారు. హనీమూన్ విషయానికొస్తే, క్షమా గోవాకు వెళ్లే ఆలోచనలో ఉంది.
''స్వీయ వివాహం అంటే నీ పట్ల నువ్వు అంకిత భావం కలిగి ఉండడం. ఎటువంటి షరతుల్లేని ప్రేమకు నిదర్శనం. తనను తాను స్వీకరించడం. ప్రజలు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. నన్ను నేనే ప్రేమించాను.. అందుకే ఈ పెళ్లి" అని క్షమాబిందు చెబుతోంది.
News Summary - Gujarat woman Kshama Bindu set to marry herself in India's first sologamy
Next Story