Tue Dec 24 2024 03:13:35 GMT+0000 (Coordinated Universal Time)
జ్ఞానవాపి మసీదు ఆవరణలో బావిని సీజ్ చేయండి : కోర్టు ఆదేశం
ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు.. బావిని సీజ్ చేసి, ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది
వారణాసి : ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు గురించి కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ మసీదు ప్రాంగణం మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని స్థానిక జిల్లా కోర్టు గతంలో ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు.. మసీదులో వీడియో సర్వే చేస్తుండగా.. జ్ఞానవాపి - శృంగార్ గౌరీ దేవి కాంప్లెక్స్ ఆవరణ బావిలో శివలింగాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని సర్వే చేస్తున్న వారిలో ఒకరైన విష్ణుజైన్ సివిల్ జడ్జి కోర్టుకు తెలుపుతూ.. దానిని పరిరక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు.. బావిని సీజ్ చేసి, ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్కడికి ఎవరినీ అనుమతించవద్దని కలెక్టర్ కౌషల్ రాజ్ శర్మను ఆదేశించింది. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, సీఆర్పీఎఫ్ వారణాసి విభాగం సంబంధిత ప్రాంత భద్రత బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. కాగా కోర్టు ఆదేశాలను తాము అనుసరిస్తామని మసీదు నిర్వహణ కమిటీ జాయింట్ సెక్రటరీ యాసిన్ ప్రకటించారు. ''కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తాం. సర్వేకు పూర్తి సహకారం అందిస్తాం. కానీ, పిటిషనర్లతో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులు ప్రకటనలు చేస్తుండడం, సర్వే వివరాలను లీక్ చేస్తుండడం ఎంతో బాధకు గురిచేస్తోంది''అని యాసీస్ పేర్కొన్నారు.
Next Story