Sat Dec 28 2024 01:53:49 GMT+0000 (Coordinated Universal Time)
శబరిగిరీషుడికి రికార్డు స్థాయిలో ఆదాయం.. జనవరి నాటికి రూ.200 కోట్లు?
కాగా.. ఈ ఏడాది మకరవిలక్కు సీజన్ మొదలైన 28 రోజుల్లోనే.. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు రూ.148 కోట్ల ఆదాయం
శబరిమల కొండపై ఉన్న శబరిగిరీషుడి ఆలయానికి రికార్డుస్థాయిలో ఆదాయం వస్తోంది. రెండేళ్లుగా శబరిమలకు వెళ్లే వీలులేదు. గతేడాది ఆలయం తెరుచుకున్నా.. పరిమిత సంఖ్యలో మాత్రమే స్వాములను దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది (2022) పూర్తిస్థాయిలో అందరినీ దర్శనానికి అనుమతించడంతో.. మాలధారణలు చేపట్టిన స్వాములు.. మండల దీక్షల విరమణకై శబరిమలకు పయనమవుతున్నారు. రోజుకు 10 వేలమంది అయ్యప్పలు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.
కోవిడ్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో.. ఈ ఏడాది ఆలయం తెరచుకున్న తొలిరోజే.. 30 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శన స్లాట్‌ను బుక్ చేసుకున్న వాళ్లే కాకుండా.. స్పాట్ బుకింగ్, ఇతర మార్గాల ద్వారా రోజుకు దాదాపు 10 వేల మంది భక్తులు వస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి భక్తులు 10 గంటలకు పైగా క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు.. పోలీసులు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా.. ఈ ఏడాది మకరవిలక్కు సీజన్ మొదలైన 28 రోజుల్లోనే.. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు రూ.148 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 10వ తేదీ నాటికే ఆలయానికి రూ.125 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఈ సీజన్లో రూ.151 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది 28 రోజులకే రూ.148 కోట్ల ఆదాయం సమకూరింది. జనవరి 21 నాటికి మకరవిలక్కు సీజన్ ముగియనుండగా.. ఆ సమయానికి దేవస్థాన ఆదాయం రూ.200 నుండి రూ.300 కోట్ల మధ్య ఆదాయం రావొచ్చని దేవస్థాన అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయాన్నంతటినీ ఆలయం కోసం, భక్తుల కోసం వినియోగిస్తామన్నారు.
Next Story