Fri Mar 28 2025 09:57:39 GMT+0000 (Coordinated Universal Time)
48 గంటలు భారీ వర్షాలు.. చిక్కుకున్న 200 మంది యాత్రికులు
కుల్లు-మండీ జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు

మొన్నటి వరకూ మండుటెండలు దేశంలో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తే.. ఇప్పుడు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు భయపెడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. నైరుతి రుతుపవనాల విస్తరణతో పాటు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలోని బాగీపుల్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మందికి పైగా యాత్రికులు, స్థానికులు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కుల్లు-మండీ జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. కామాండ్ ప్రాంతంలో 25-30 వాహనాలు చిక్కుకున్నట్లు సమాచారం. మరో ఐదు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. 15 జిల్లాల్లో సుమారు 3 లక్షల మంది ప్రజలు వరద బాధితులయ్యారు. ఇప్పటికే వేలాదిమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాలు, వరదల కారణంగా అస్సాం లో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నలుగురు, రుద్రప్రయాగ్ లో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు.
ముంబై భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ముంబై సహా మహారాష్ట్ర తీరప్రాంతంలో రాగల 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముంబైతో పాటు ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్, ఉత్తరాఖండ్ లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ.
Next Story