Sat Nov 23 2024 03:42:54 GMT+0000 (Coordinated Universal Time)
మయన్మార్ సరిహద్దుల్లో భారత టెకీలు బందీలుగా.. ఎన్నో చిత్ర హింసలు
చుట్టూ భారీ ప్రహరీ గోడలు, వాటికి కాపలాగా స్నిప్పర్ రైఫిల్స్‌తో ఉన్న గార్డులు ఉంటారు.
మయన్మార్‌లోని మయావాడి ప్రాంతంలో 500 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వారు స్వదేశానికి తిరిగి రావాలని కోరుతున్నారు. ఉద్యోగాల పేరిట వారిని తీసుకుని వెళ్లి.. బంధించి, బలవంతంగా వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. సైబర్ నేరాలను చేయడానికి నిరాకరిస్తే విద్యుత్ షాక్‌లిచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మయావాడి కాంప్లెక్స్‌లోని కోకో టెక్ పార్క్‌లో ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మాఫియా కింద పలువురు భారతీయులు ఇక్కడ టెలి-కాలర్లుగా పని చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ సైట్లు, నకిలీ గేమింగ్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను బలవంతం చేస్తున్నారు.
థాయ్‌లాండ్-మయన్మార్ సరిహద్దు వెంబడి ఉన్న ఈ ప్రాంతాన్ని చైనా జాతీయులు నియంత్రిస్తున్నారని, వారి చేతుల్లో నష్టపోయిన భారతీయ ఐటీ ఉద్యోగులు చెప్పారు. చాలా ఎక్కువ జీతాలు ఇస్తామని వాగ్దానం చేస్తారట.. ఆ తర్వాత వారు 'మార్షల్ లా' కింద జీవించాలని చెబుతుంటారు. ఈ భాగంలో థాయ్‌లాండ్ అధికారులు లేదా మయన్మార్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేరని అంటున్నారు. అక్కడ చిక్కుకున్న భారతదేశానికి చెందిన సాంకేతిక నిపుణులు, వారి ఆదేశాలను పాటించడానికి నిరాకరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. తప్పించుకోవడం అసాధ్యమని కూడా చెప్పారు. రిక్రూట్మెంట్ రాకెట్లో పాకిస్థానీయులు కూడా భాగస్వాములుగా ఉన్నారని భావిస్తున్నారు.
చుట్టూ భారీ ప్రహరీ గోడలు, వాటికి కాపలాగా స్నిప్పర్ రైఫిల్స్‌తో ఉన్న గార్డులు ఉంటారు. రోజుకు 16 గంటల పనిచేయించుకున్నా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వరు. సరైన భోజనం కూడా పెట్టరు. ఎదిరించే వాళ్లను ఏకంగా కాల్చి చంపుతామని బెదిరిస్తుంటారు. పాస్‌పోర్టులను లాక్కోవడమే కాదు, మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధిస్తారు. ''భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లాలి. లేకుంటే బతుకుతామనే ఆశ కూడా లేదు" అని ఓ ఐటీ నిపుణుడు తెలిపారు. కొందరు భారీగా డబ్బు ఇచ్చి కూడా బయట పడుతూ ఉన్నారు. వెళ్ళిపోవాలనే వారిని జైళ్లలో కూడా పెడుతున్నారు.
మయన్మార్ తీసుకువెళ్లి సైబర్ నేరాలు చేయిస్తున్న రాకెట్ తో ప్రమేయం ఉన్న నాలుగు కంపెనీలను గుర్తించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్కడ చిక్కుకు పోయిన భారతీయులను రక్షించే పనిలో ఉన్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మయన్మార్‌లో కొందరు భారతీయుల్ని బంధీలుగా చేసుకున్నారనే కథనాలు బయటకు రావడంతో అంతర్గత తనిఖీలు ఎక్కువయ్యాయి. కొంత మందిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Next Story